భారతీయులను తరలింపుకు నలుగురు మంత్రులు

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు నలుగురు కేంద్ర మంత్రులతో కమిటీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియమించారు.
 
ఉక్రెయిన్ సంక్షోభంపై సోమవారం ఏర్పాటు చేసిన అత్యున్నత సమీక్షా సమావేశంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు, జనరల్ వీకే సింగ్‌లను భారత విద్యార్థుల తరలింపు కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఉక్రెయిన్, పొరుగు దేశాలకు పంపాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 
ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా, ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు.
 
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ఇండిగో కూడా ఆపరేషన్ గంగాలో చేరనుంది. ఈ సమీక్షా సమావేశంలో భారతీయ విద్యార్థుల భద్రత, తరలింపునకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోదీ ఆదేశించారు.భారతీయులను సురక్షితంగా, త్వరగతిన స్వదేశానికి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశంగా ఈ మిషన్‌ను చేపట్టారు. 
 
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశంలో 16 వేల  మందికి పైగా భారతీయులు  విద్యార్థులు చిక్కుకుపోయారు. ఇప్పటికి రెండు, మూడు విమానాలలో కొన్ని వందల మందిని మాత్రమే తీసుకు రాగలిగారు. అక్కడ వారు సురక్షితమైన ఆశ్రయం, ఆహారం లేక చలిలో చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తున్నది. 
 
దానితో మన దేశంలోని వారి తల్లితండ్రులు, కుటుంభం సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌ నుంచి పోల్యాండ్‌కు వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ తరుణంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండగా.. భారతీయులపై స్థానిక పోలీసులు దాడి చేసిన వీడియోలు వైరల్‌ అయ్యాయి