ప్రధాని మోదీ సాయం కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

ప్రధాని మోదీ సాయం కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
ఉక్రెయిన్ పై రష్యా దాడిచేసి, దారుణంగా విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో  ఉక్రెయిన్ అధ్యక్షుడు పోలోదిమిర్ జెలెన్‌స్కీ భారత్ సాయం కోరారు.  ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఎస్‌సీ)లో ఉక్రెయిన్‌కు రాజకీయ మద్దతు పలకాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి శనివారం సాయంత్రం ఆయన ఫోన్ చేశారు. 
 
ఈ విషయాన్ని ఓ ట్వీట్‌లో జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడానని, రష్యా దాడులు, దానిని తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలను ఆయనకు వివరించానని తెలిపారు. 
 
లక్ష మందికి పైగా దురాక్రమణదారులు తమ మాతృభూమిపై దండెత్తిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువచ్చి, ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో రాజకీయ మద్దతు ఇవ్వమని కోరామని ఆ ట్వీట్‌లో జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా దాడులు ఆపేలా కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు.
 
కాగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా జరిగే ఆస్తినష్టం, ప్రాణనష్టంపై ఫోను సంభాషణల్లో ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం దాడులు ఆపి, చర్చలు ప్రారంభించాలని సూచించారు. శాంతి ప్రయత్నాల్లో ఎలాంటి సాయం అందించడానికైనా భారత్ సిద్ధంగా ఉన్నట్టు  మోదీ తెలియజేశారు. 
 
ఇదే సమయంలో, ఉక్రెయిన్‌లోని భారత ప్రజల భద్రతపై కూడా ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ పౌరులను సురక్షితంగా ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి పంపేందుకు ఉక్రెయిన్ అధికారులను వేగవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి ఒకరోజు ముందే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని ఫోనులో మాట్లాడారు. ఉక్రెయిన్‌పై దాడులను తక్షణం నిలిపివేయాలని కోరారు.
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో టెలిఫోన్‌చేసి మాట్లాడి, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానానికి భారత్ మద్దతును కోరిన మరునాడే జెలెన్‌స్కీ టెలిఫోన్‌లో ప్రధాని మోదీతో మాట్లాడారు. మిలిటరీ దాడిని ఆపేసేలా రష్యాపై భారత్ తన ప్రభావాన్ని చూపాలని కూడా ఆయన కోరారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడానికి సాయపడాలని అభ్యర్ధించారు.  
పుతిన్, లావ్రోవ్‌లపై వ్యక్తిగత ఆంక్షలు

ఇలా ఉండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌లపై అమెరికా అరుదైన ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌పై దాడికి వారే బాధ్యులని పేర్కొంది. అమెరికా, దాని మిత్రదేశాలు ఈ వారం రష్యాపై ఆర్థిక ఆంక్షలు కూడా విధించాయి. దీనికి తోడు అమెరికా రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, సైనిక జనరల్ వాలెరీ గెరాసిమోవ్‌పై కూడా ఆంక్షలు విధించింది. 

పుతిన్‌కు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంతర్జాతీయ సంకీర్ణాన్ని నిర్మించారని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి డెయిలీ న్యూస్ కాన్ఫరెన్స్‌లో విలేకరులకు చెప్పారు. కాగా పుతిన్, లావ్రోలపై విధించిన ఆంక్షలను సెనేటర్ జాక్ రీడ్ స్వాగతించారు. ఆంక్షల కారణంగా రష్యా కరెన్సీ విలువ బాగా పడిపోయింది.