ఉక్రెయిన్ పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు, బిక్కు మంటున్న భారతీయ పౌరులు, విద్యార్థులు తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. రుమేనియా నుంచి తొలి రెండు ఎయిర్ ఇండియా విమానాలు 469 మందితో భారత్ కు చేరుకున్నాయి.
మొదటి విమానం 219 మందితో గత రాత్రి 8.45 గంటల ప్రాంతంలో ముంబై విమానాశ్రయంపై చేరుకోగా, రెండో విమానం ఆదివారం ఉదయం 250 మందితో ఢిల్లీ విమానాశ్రయంకు చేరుకొంది. భారతీయులను అక్కడి నుండి తరలించే కార్యక్రమము `ఆపరేషన్ గంగా’ అని నామకరణం చేశారు.
శనివారం మొదటి ఎయిర్ ఇండియా విమానం ముంబైకి చేరుకోగా ముంబై విమానాశ్రయంలో విద్యార్థులకు కేంద్రమంత్రి గోయల్ స్వాగతం పలికారు. విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. మరోవంక, ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వారికి స్వాగతం పలికారు.
ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరుల తరలింపు ప్రారంభమైందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. తరలింపు బృందాలు 24 గంటలూ క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాయని చెప్పారు. తాను స్వయంగా తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నానని వెల్లడించారు.
అంతకుముందు ఎయిర్ ఇండియా తొలి విమానం శనివారం మధ్యాహ్నం ముంబయి నుంచి రొమానియా రాజధాని బుకారెస్ట్‌కు బయలుదేరిందని అధికారులు తెలిపారు. ఇక రెండో విమానం ఢిల్లీ నుంచి శనివారం 11.40కు బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు(భారతీయ కాలమాన ప్రకారం) బుకారెస్ట్ చేరుకుంటుందని కూడా వారు తెలిపారు.
మరో విమానాన్ని కూడా పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉక్రెయిన్-రొమానియా సరిహద్దుకు చేరుకున్న భారతీయులను భారతీయ ప్రభుత్వ అధికారులు బుకారెస్ట్‌కు చేర్చారు. ఇదిలా ఉండగా బయలుదేరిన ఎయిర్ ఇండియా రెండో విమానం(ఏఐ1942) కూడా మరి కొంత మంది భారతీయులను ఆదివారం తెల్లవారు జామున న్యూఢిల్లీకి తీసుకువచ్చింది.
కాగా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను ఆ దేశానికి పొరుగున ఉన్న రొమేనియా, హంగేరితో సహా ఇతర దేశాల నుంచి ప్రత్యేక విమానాలలో తరలిస్తున్నట్లు శనివారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ప్రభుత్వం వివరించింది. ఉక్రెయిన్‌లో పౌర విమానాశ్రయాలను మూసివేసిన కారణంగా ఆ దేశం నుంచి సరిహద్దుల వరకు భారతీయులను తరలించి పొరుగు దేశాల నుంచి విమానాల ద్వారా భారత్‌కు రప్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
హంగరీ, రొమానియా, పొలాండ్ గుండా రావాలనుకుంటున్న భారతీయుల కోసం పశ్చిమ ఉక్రెయిన్ నగరాలైన ఎల్వివ్, చెర్నివ్టీ నగరాల్లో భారత్ క్యాంప్ ఆఫీసులు నెలకొల్పింది. దీనికి తోడు హంగరీ, పొలాండ్, స్లోవాక్ రిపబ్లిక్, రొమానియా బార్డర్ పోస్ట్‌ల వద్ద అధికారుల బృందాలను కూడా భారత్ ఏర్పాటుచేసింది.
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతదేశానికి చెందిన విద్యార్థులను తిరిగి మన దేశానికి తీసుకురావటానికి భారత ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. నిరంతరం సరిహద్దు దేశాల అధికారులతో, భారత రాయబార కార్యాలయాల అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని పేర్కొన్నారు. చిట్టచివరి విద్యార్థిని తరలించే వరకూ నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన ఈ మిషన్ ఆగదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు