27 దేశాల నుంచి ఉక్రెయిన్ కు ఆయుధాల సహాయం

అమెరికా, బ్రిటన్ లతో సహా తమ మిత్రులైన 27  దేశాల నుంచి ఆయుధాలు, ఇతర పరికరాలు రాబోతున్నట్లు  ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ శనివారం ప్రకటించారు. యుద్ధ వ్యతిరేక కూటమి కోసం ఏర్పాటు చేయడానికి  ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. 
 
బ్రిటన్ రక్షణ కార్యదర్శి, బెన్ వాలెస్ శుక్రవారం సాయంత్రం సైనిక సహాయం  దాతల సమావేశాన్ని విర్చువల్ గా నిర్వహించారు, 25 దేశాలు ఈ సదస్సులో పాల్గొని సహాయం అందించడానికి సంసిద్ధతను ప్రకటించగా, అందులో పాల్గొనని మరో రెండు దేశాలు కూడా సహాయం ప్రకటించాయి.

మందుగుండు సామాగ్రి, ట్యాంక్ వ్యతిరేక ఆయుధాలు, వాయు నిరోధక ఆయుధాలతో పాటు వైద్య సామాగ్రి కూడా సహాయంగా అందించనున్నారు.  నాటోలో సభ్యత్వం లేని దేశాలు కూడా ముందుకు వచ్చాయి.

ఫ్రాన్స్ ఉక్రెయిన్‌కు రక్షణ పరికరాలను అందజేస్తుందని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శుక్రవారం ఆ దేశ రెండు శాసన సభలకు వ్రాతపూర్వక ప్రసంగంలో తెలిపారు. ప్రసంగంలో పరికరాలు ఏమిటో వివరించలేదు. ఫ్రాన్స్ ఉక్రెయిన్‌కు “300 మిలియన్ యూరోల అదనపు బడ్జెట్ సహాయం” అందజేస్తుందని  “వారికి అవసరమైన రక్షణ సామగ్రిని అందజేస్తుందని” మాక్రాన్ రాశారు.  అంతకు ముందు ఆయనతో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్ లో మాట్లాడారు.

ఇదిలావుండగా, ఉక్రెయిన్‌కు 600 మిలియన్ డాలర్లు సహాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో నాటో  స్పందన దళాన్ని యాక్టివేట్ చేశారు. సైన్యం, వాయు సేన, నావికా దళం దీనిలో ఉన్నాయి. నాటో సుప్రీం అల్లయిడ్ కమాండర్ జనరల్ టోడ్ వోల్టర్స్ ఈ దళాన్ని యాక్టివేట్ చేశారు. అయితే నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం లేదు. కాబట్టి ఈ దళం ఆ దేశానికి వెళ్ళడానికి అవకాశం లేదు.

మరోవంక, ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా ఓ వైపు చర్చలకు సిద్దమంటూనే మరో వైపు దాడిని కొనసాగిస్తోంది . ఇప్పటికే దాదాపు 10 కి పైగా నగారాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకున్న రష్యన్ బలగాల,  తాజాగా మరో నగరంపై పట్టు సాధించాయి.
 
ఉక్రెయిన్ లోని ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న మెలిటోపోల్ నగరంను ఆక్రమించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎయిర్, షిప్ బేస్డ్ మిస్సైల్స్ తో దాడులు చేసి ఉక్రెయిన్ లోని మిలిటరీ టార్గెట్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది.రాజధాని నగరం కైవ్‌లో రాత్రిపూట భారీ తుపాకీ కాల్పులు,  పేలుళ్లు వినిపించాయి. 
 
మరో వైపు రష్యా సైనిక చర్యలను దీటుగా ఎదుర్కొంటున్నామని ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. దాదాపు 3500 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని ట్వీట్ చేసింది. 200 మంది సైనికులు బందీలుగా ఉన్నారని తెలిపింది.  14 విమానాలను, 8 హెలికాప్టర్లను కూల్చామని ఉక్రెయిన్ బలగాలు తెలిపాయి. 102 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని చెప్పారు. అయితే తమ సైనికులు ఎవరూ చనిపోలేదని రష్యా ప్రకటించింది. 
 
రష్యా దళాలు శనివారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌లోకి చొచ్చుకెళ్ళాయి. దీంతో వీథి పోరాటం మొదలైందని కీవ్ అధికారులు ప్రజలను హెచ్చరించారు. ప్రజలు షెల్టర్లు, బంకర్లలో ఉండాలని, కిటికీలకు దూరంగా ఉండాలని తెలిపారు. పేలుళ్ళు జరిగినపుడు శిథిలాలు ఎగిరిపడి, దెబ్బలు తగిలే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.