రష్యా వీటోతో వీగిన భద్రతా మండలి తీర్మానం 

ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ పై దాడిని ఖండిస్తూ ఓటు వేశాయి. అయితే భద్రతామండలిలో ఐదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించి ముసాయిదాను తిరస్కరింది. 

ఇక మొదటి నుంచి ఉక్రెయిన్, రష్యా వివాదంలో తటస్థంగా ఉన్న భారత్ తో పాటు చైనా, యూఏఈలు ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. రష్యాను ఏకాకిగా చేయాలని భావించిన అమెరికా మరో దేశం అల్బేనియాతో కలిసి ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 

ఉక్రెయిన్‌పై దాడిని వెంటనే రష్యా నిలిపేయాలని, ఉక్రెయిన్ నుంచి అన్ని దళాలను పూర్తిగా ఉపసంహరించాలని ఈ తీర్మానం ప్రతిపాదించింది. మరోవైపు 193 సభ్యదేశాలు ఉన్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఈ ముసాయిదాను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

భద్రతామండలిలో రష్యా వీటోను ఉపయోగించి తీర్మానాన్ని అడ్డుకున్నప్పటికీ ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరి చేశామని పశ్చిమదేశాలు భావిస్తున్నాయి. తీర్మానాన్ని వీటో చేసినంత మాత్రానా ప్రపంచ దేశాల గొంతును అణచలేరని అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ స్పష్టం చేశారు. నిజాన్ని ఎప్పటికీ వీటో చేయలేరని తెలిపారు.

కాగా,  తీర్మానం వీగిపోవడంతో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఐరాస యుద్ధం నుంచి పుట్టిందని, యుద్ధాన్ని అంతం చేయడం కోసం పుట్టిందని, నేడు ఈ లక్ష్యం నెరవేరలేదని పేర్కొన్నారు. అయితే మనం ఆశావాదాన్ని వదిలిపెట్టకూడదని చెప్పారు.  శాంతి కోసం మనం మరొక అవకాశం ఇవ్వాలని తెలిపారు. 

ఐక్యరాజ్య సమితి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో ఏర్పాటైంది. కాగా, ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాలన్నీ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. తాము ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు తీసుకెళ్తామని చెప్పాయి. రష్యాను జవాబుదారీ చేస్తామని తెలిపాయి.

ఓటింగ్ లో పాల్గొనని భారత్ 

తాత్కాలిక సభ్య దేశంగా ఉన్న భారత్.. ఈ ఓటింగ్ లో ఏ పక్షానికీ మద్దతు తెలపలేదు. తమ ఓటు ఎవరికీ వేయకుండా ఉండడానికి కారణాన్ని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ మూర్తి వివరించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతున్న పరిణామాలపై భారత్ ను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. తక్షణం ఉక్రెయిన్ పై దాడిని నిలిపేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఆయన కోరారు. 

ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని సూచించారు. మనుషుల ప్రాణాలను బలితీసుకోవడం ద్వారా ఎటువంటి పరిష్కారమూ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయ  స్టూడెంట్స్, పౌరుల రక్షణపై మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. 

యూఎన్ చార్టర్, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, ఇతర దేశాల భౌగోళిక సరిహద్దులు, సార్వభౌమత్వాన్ని గౌరవించి సభ్య దేశాలన్నీ నిర్మాణాత్మకమైన అడుగులు వేయాలని ఆయన కోరారు. చర్చల ద్వారా మాత్రమే విభేదాలు, వివాదాలను పరిష్కరించుకోవాలని టీఎస్ మూర్తి స్పష్టం చేశారు. 

ప్రస్తుతం ఉక్రెయిన్ విషయంలో దౌత్యపరమైన పరిష్కార మార్గాలను వదిలేయడం బాధాకరమని చెబుతూ ఇప్పటికైనా ఈ దిశగా ఆలోచించాలని కోరారు. ఈ అంశాలకు అవకాశమివ్వాలన్న ఉద్దేశంతో తాము ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.