బైడెన్‌ బలహీనత కారణంగానే రష్యా ఉక్రెయిన్ పై దాడి

అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ బలహీనత కారణంగానే రష్యా.. సరిహద్దు దేశమైన ఉక్రెయిన్ సైనిక దాడులు చేస్తోందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  ఆరోపించారు.ఫ్లోరిడాలోని ఓర్లాండోలో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరగకపోతే ఈ భయంకరమైన విపత్తు జరిగేది కాదని స్పష్టం చేశారు. 

ముఖ్యంగా తాను అమెరికా అధ్యక్షునిగా ఉంటే రష్యా, ఉక్రెయిన్‌పై సైనిక దాడికి పాల్పడేది కాదని పేర్కొన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలివైనవాడు అంటూ.. అమెరికా పాలకులు (బైడెన్‌ను ఉద్దేశిస్తూ) మూర్ఖులంటూ దుయ్యబట్టారు. తాను 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా మద్దతుగల వేర్పాటువాద ప్రాంతాలు డోనెట్స్క్‌, లుహాన్స్క్‌లను రష్యా ప్రధాని వ్లాదిమిర్‌ పుతిన్‌ స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. ‘‘ఉక్రెయిన్ లోని భారీ భూభాగాన్ని స్వతంత్ర రాజ్యాలుగా పుతిన్ ప్రకటించడం అద్భుతమైన చర్య. రెండు స్వతంత్ర రాజ్యాలుగా విడగొట్టి పుతిన్ శాంతి కాముకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు” అంటూ ఇంతకు ముందు కొనియాడారు. 

డొనాల్డ్‌ ట్రంప్‌ పుతిన్‌ను తెలివైన వ్యక్తిగా అభివర్ణించడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తప్పు​పట్టారు. పుతిన్‌ను తెలివైన వ్యక్తిగా చెబుతూ తనను తాను మేధావిగా ట్రంప్‌ ప్రకటించుకుంటున్నాడని బైడెన్‌ ఎద్దేవా చేశారు.

ఇలా ప‍్రస్తుతం చైనీయులు ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లే పరిస్థితులు లేవని చైనా రాయబారి ఫ్యాన్‌ జియోన్రాంగ్‌ ఆదివారం వెల్లడించారు. రష్యా దాడి ముగిసే వరకు చైనీయులు  సంయమనం పాటించాలని కోరారు. తాను కూడా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోనే ఉన్నానని చైనీయులకు తెలిపారు. ఉక్రెయిన్‌లో ఉన్న చైనా పౌరులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 

వీలైనంత త్వరలో చైనీయులను సురక్షితంగా స్వదేశానికి చేరుస్తామని భరోసానిచ్చారు. చైనీయులు సురక్షితంగా ఉండేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మరోవైపు  ఉక్రెయిన్‌ పౌరులతో చైనా దేశస్తులు వాగ్వాదాలు, ఘర‍్షణలకు దొగొద్దని సూచించారు. వారు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని, వారి మనోభావాలను అర్ధం చేసుకొని వారికి సహకరించాలని ఆయన కోరారు.