రష్యాతో బెలారస్‌లో శాంతి చర్చలకు ఉక్రెయిన్ నిరాకరణ

నాలుగు రోజులుగా ఉక్రెయిన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న రష్యా మరోవైపు చర్చలకు తలుపులు తెరిచింది. అనేక ఉక్రెయిన్ నగరాలపై దాడులు చేస్తున్న తరుణంలో నాలుగో రోజున ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా ప్రతినిధి బృందం బెలారస్ వెళ్ళినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఆదివారం తెలిపింది. 

అయితే, యుద్ధం నేపథ్యంలో రష్యాతో బెలారస్‌లో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తిరస్కరించారు. తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడుల్లో కొన్ని బెలారస్ గడ్డపై నుంచి జరుగుతున్నాయన్నారు. ఉక్రెయిన్‌పై దూకుడు స్వభావం ప్రదర్శించని ప్రాంతంలో మాత్రమే చర్చలు జరపడానికి వస్తామని చెప్పారు. 

ఉక్రెయిన్‌లో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలపై రష్యన్ దళాలు బాంబులు కురిపించాయని, శనివారం-ఆదివారం మధ్య రాత్రి అత్యంత కిరాతకంగా వ్యవహరించాయని జెలెన్‌స్కీ తెలిపారు. మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేని, ప్రజలు నివసించే చోట దాడులు చేశారని చెప్పారు. అంబులెన్సులతో సహా ప్రతిదానిపైనా దురాక్రమణదారులు దాడి చేస్తున్నారని జెలెన్‌స్కీ అన్నారు.

రష్యా పంపించిన ప్రతినిధి బృందం ఇప్పటికే బెలారస్‌లోని గోమెల్ నగరానికి చేరుకుంది. ఉక్రెయిన్ ప్రతినిధి బృందం రాక కోసం ఎదురు చూస్తోంది. ఈ బృందంలో రష్యా విదేశాంగ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, దేశాధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ కార్యాలయం అధికారులు ఉన్నట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైన తర్వాత చర్చలకు సిద్ధమవడం ఇదే మొదటిసారి. 

 బెలారస్‌లో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్‌కు రష్యా పంపిన ఆహ్వానంపై బెలారస్ అధినేత అలెగ్జాండర్ లుకాషెంకో స్పందించారు. రష్యా ఆహ్వానాన్ని ఒప్పుకోవాలంటూ ఉక్రెయిన్‌ను ఆయన కోరారు. రష్యాతో వీలైనంత తొందరలో ఉక్రెయిన్ చర్చలు జరపడం ఉత్తమమని, ఎందుకు ఉక్రెయిన్‌కు దేశస్థాయి హోదా పోకుండా కాపాడుకోవాలని అలెగ్జాండర్ అన్నట్లు రష్యన్ మీడియా పేర్కొంది.