కొన్ని వీసాలకు వ్యక్తిగత ఇంటర్వ్యూల నుండి మినహాయింపు

అమెరికా కొన్ని రకాల వీసాలకు వ్యక్తిగత ఇంటర్వూ నుంచి భారతీయులకు మినహాయింపును ఇచ్చింది. విద్యార్థులు, వృత్తి నిపుణులు, కళాకారులు, అసాధారణ ప్రతిభ కలవారికి ఇచ్చే వివిధ రకాల వీసా దరఖాస్తుదారులకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ మినహాయింపును ఇస్తున్నట్లు అమెరికాకు చెందిన ఓ సీనియర్ అధికారి భారత సంతతి ప్రతినిధులకు తెలిపారు. 

విద్యార్థులు(F, M,J), వృత్తి నిపుణులు(H—-1, H2,H3, వ్యక్తిగత L వీసాలు), కళాకారులు, విశిష్ట ప్రతిభావంతులు(O,P,Q)కు ఇచ్చే వీసా దరఖాస్తుదారులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది.

“వ్యక్తిగత ఇంటర్వూ రద్దు వల్ల చాలా మంది వీసా దరఖాస్తుదారులకు మేలు చేకూరుతుంది. ఇది మన మిత్రులు, కుటుంబసభ్యులకు ఎంతో మేలు చేకూర్చనుంది. దీనివల్ల చాలా మందికి అడ్డంకులు, అవరోధాలు తొలిగిపోతాయి” అని దక్షిణాసియా కమ్యూనిటీ లీడర్ అజయ్ జైన్ భుటోరియా తెలిపారు. 

ఈయన ఆసియా అమెరికన్లకు చెందిన అంశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. దక్షిణ మధ్య ఆసియా అసిస్టెంట్ సెక్రటరీ డొనాల్ లూతో జరిపిన భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్ 31 వరకు వ్యక్తిగత ఇంటర్వూలు రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారని భుటోరియా తెలిపారు. 

కాగా ఈ వ్యక్తిగత ఇంటర్వూ రద్దు ప్రోగ్రామ్ కింద లబ్ధి పొందాలంటే గతంలో ఏదైనా అమెరికన్ వీసా ప్రోగ్రామ్ కింద వీసా పొంది ఉండాలి. గతంలో వీసా తిరస్కరణకు గురైనవారు, తగిన అర్హత లేనివారు వ్యక్తిగత ఇంటర్వూ మినహాయింపును పొందలేరు.

అమెరికాలో ఏ వీసా జారీకైనా వ్యక్తిగత ఇంటర్వూ తప్పనిసరి. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇంటర్వూల నుంచి అమెరికా మినహాయింపును ఇస్తోంది.

న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైలో ఉన్న దాని కాన్సులేట్‌లు 2022 వసంత కాలానికి(స్ప్రింగ్) అదనంగా 20వేల మంది ఇంటర్వూ మినహాయింపును పొందవచ్చని అమెరికా రాయబార కార్యాలయం తన వెబ్‌సైట్‌లో ప్రకటనను పోస్ట్ చేసింది.