ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులకు హెల్ప్‌లైన్‌ నెంబర్లు

ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న ఇతర దేశాల పౌరుల భద్రతపై భయాందోళనలు నెలకొన్నాయి. సంక్షోభ సమయం నుంచి ఇప్పటి వరకు చాలామంది ఉక్రెయిన్‌ను వీడగా, పరిస్థితి ఇక్కడిదాకా వస్తుందని ఊహించని వాళ్లు ప్రత్యేకించి విద్యార్థులు తరగతుల నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయారు. ఈ పరిణామాల నడుమ తెలుగు రాష్ట్రాల విద్యార్థులను సురక్షితంగా రప్పిస్తామని తల్లిదండ్రులకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 

ఉక్రెయిన్‌లో చిక్కుకున తెలుగు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల భద్రతపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సీఎస్ సమీర్ శర్మ, సీఎంఓ అధికారులు, సలహాదారు జితేష్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను సురక్షితంగా రప్పించే విషయమై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ కోరగా.. కేంద్రం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా వివరించారు జైశంకర్‌. అనంతరం ప్రత్యేక హెల్ప్‌లైన్‌లపై అధికారులకు సూచనలు చేశారు.

APNRTS హెల్ప్‌లైన్‌ నెంబర్‌: 0863-2340678, ఏపీ హెల్ప్‌లైన్‌ వాట్సాప్‌ నెంబర్‌ +918500027678

ఢిల్లీలో సంప్రదించాల్సిన అధికారులు:  శివ శంకర్‌- 9871999055, రామారావు-9871990081, సాయిబాబు- 9871999430

ఉక్రెయిన్‌లోని వార్ జోన్‌లో చిక్కుకుపోయిన పిల్లల తల్లిదండ్రులు విశాఖపట్నంలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్‌లో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిని కలిశారు. వారి సమస్యలను విని విదేశాంగ మంత్రి జైశంకర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అండగా ఉంటామని హామీ ఇచ్చారు విజయసాయి రెడ్డి. అంతేకాదు ఉక్రెయిన్‌లోని తెలుగు ప్రజలు 9871999055 & 7531904820 ద్వారా సాయం కోరవచ్చని రాజ్యసభ విజయసాయి రెడ్డి ట్విటర్‌ ద్వారా తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం: ఉక్రెయిన్‌లో చదువుతున్న తమ రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. వారి తరలింపునకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ నుంచి సుమారు ఆరు వందల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చేస్తున్నట్టు సమాచారం.

వీరిలో సగానికి పైగా విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. తమను రక్షించాలని.. త్వరగా ఇండియాకి వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ అనేక కాల్స్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లిలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశారు.

న్యూఢిల్లీ, తెలంగాణ భవన్‌కు సంబంధించిన హెల్ప్‌ లైన్‌ నెంబర్లు:

విక్రమ్  సింగ్‌ మాన్‌, ఐపీఎస్‌ : 7042566955, చక్రవర్తి, పీఆర్వో: 9949351270, నితిన్‌, ఓఎస్‌డీ: 9654663661

తెలంగాణ సెక్రటేరియట్‌, హైదరాబాద్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్లు: చిట్టిబాబు, ఏఎస్‌వో: 040-23220603, 9440854433

ఈమెయిల్‌ ఐడీ: so_nri@telangana.gov.in