స్టాక్‌ ఎక్సేంజీ కుంభకోణం కేసులో `అదృశ్య హస్తం’ చిదంబరం!

కొద్దీ రోజులుగా సంచలనం కలిగిస్తున్న, మార్కెట్‌, ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్న  నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ (ఎన్‌ఎస్‌ఇ) కో లొకేషన్‌ కుంభకోణం కేసులో ప్రధాన పాత్రధారి ఆనంద్‌ సుబ్రమణియన్‌ అని తేల్చారు. శుక్రవారం ఆయన్ను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) చెన్నరులో అరెస్ట్‌ చేసింది.
 ఎన్‌ఎస్‌ఇ చీఫ్‌ స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌ (సిఎస్‌ఒ) ఆనంద్‌ సుబ్రమణియస్‌ను నియమించడం, తిరిగి గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, సలహాదారుగా మార్చడం వంటి విషయాల్లో పాలనాపరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ, సిబిఐ ఇటీనల దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. చిత్రా రామకృష్ణకు సలహాదారుగా కూడా ఆయన పని చేశారు.
ఈ కాలంలో నిబంధనలకు విరుద్ధంగా, అనైతికంగా వీరిద్దరు కీలకమైన సమాచారం బయట పెట్టారని ఇప్పటికే సెబీ విచారణలో తేలింది. అయితే వీరిద్దరూ పాత్రధారులే అని, అసలు సూత్రదారులు వేరే ఉండవచ్చని దర్యాప్తు బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా అప్పటి ఆర్ధిక మంత్రి పి చిదంబరంపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది.
వీరిద్దరూ తమిళనాడుకు చెందిన వారు కావడం, ఆయన ఆర్ధిక మంత్రిగా ఉండగానే కీలకమైన పదవులకు వీరిని నియమించడం గమనార్హం. ఆర్ధిక మంత్రి ప్రమేయం లేకుండా వీరిని నియమించే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఆ దిశలో ఇప్పటి వరకు దర్యాప్తు కొనసాగిన్నట్లు కనబడటం లేదు.
పైగా, వీరిద్దరి అక్రమాల కారణంగా గరిష్టంగా స్టాక్ ఎక్స్చేంజిలో ప్రయోజనం పొందిన కంపెనీలను గుర్తిస్తే అదృశ్య శక్తుల బండారాన్ని బహిర్గతం చేయడం సులభం అయ్యే అవకాశం ఉంది.  ఈ కేసు విచారణలో సిబిఐ, సెబీ వర్గాలు చిత్రను ప్రశ్నించగా.. తాను ఓ `అదృశ్య యోగి’ సూచనల మేరకు నడుచుకున్నానని విస్మయకరం విషయం చెప్పడం తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి సుబ్రమణియన్‌ ఈ నెల 10వ తేదీ నుంచి పలుమార్లు సిబిఐ విచారణకు హాజరవుతున్నారు. విచారణకు ఆనంద్‌ సహకరించడం లేదని సిబిఐ వర్గాలు తెలిపాయి. చిత్రను ఉపయోగించుకుని ఈ యోగి ఎన్‌ఎస్‌ఇ అంశాల్లో తలదూర్చారని సెబీ విచారణలో తేలింది. 
 
స్టాక్‌ ఎక్సేంజీకి సంబంధించిన వ్యాపార ప్రణాళికలు, బోర్డు అజెండా, ఆర్థిక అంచనాలు వంటి కీలక విషయాలు లీక్‌ అయ్యాయని వెల్లడయ్యింది. సుబ్రమణియన్‌ నియామకంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సెబీ ఇటీవల చిత్రా రామకృష్ణకు ఏకంగా రూ.3 కోట్ల జరిమానాతో మూడేళ్ల పాటు స్టాక్‌ మార్కెట్లలో పాల్గొనకుండా నిషేధం విధించింది. 
 
45 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. సుబ్రమణియన్‌, చిత్రా రామకఅష్ణ ఇరువురి మధ్య జరిగిన ఈ మెయిల్‌ సంభాషణలూ బయటపడ్డాయి. ఈ క్రమంలోనే పన్ను ఎగవేత, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై ఐటి సోదాలు చేపట్టారు. 2009లో ఎస్‌ఎస్‌ఇలో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులైన చిత్రా రామకృష్ణ, 2013లో సిఇఒగా పదోన్నతి పొందారు. వ్యక్తిగత కారణాలతో 2016లో ఈ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.