ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధపడిన రష్యా

ఒక వంక ఉక్రెయిన్ పై భీకర యుద్ధం సాగిస్తూనే అనూహ్యంగా ఆ దేశంతో చర్చలకు సిద్ధమని రష్యా శుక్రవారం సాయంత్రం ప్రకటించింది. ప్రపంచ దేశాలు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా వినకుండా దండయాత్రం కొనసాగిస్తూ వస్తున్న రష్యా అధినేత  వ్లాదిమిర్ పుతిన్యూరోపియన్ యూనియన్ ఆంక్షల పర్వం కురిపించినా  పెడచెవిన పెట్టారు. పైగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదని, తాను ఎంతకైనా తెగిస్తానని గురువారం హెచ్చరికలు సైతం చేశారు.

అయితే శుక్రవారం సాయంత్రం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు. నిజంగానే చైనా అధ్యక్షుడి ప్రభావమో, లేదంటే మరింకేదైనా కారణం ఉందో తెలియదు కానీ.. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమని పుతిన్ ప్రకటించారు. 

ఇరు దేశాలకు సరిహద్దు దేశమైన బెలారస్ రాజధాని మింస్క్‌కు చర్చల కోసం ఎన్నున్నారు. మింస్క్‌కు తమ ప్రతినిథులను పంపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ కార్యాలయ అధికార ప్రతినిధి డ్మిర్టీ పెస్కోవ్ పేర్కొన్నారు. ఆ తర్వాత టెలివిజన్‌లో పుతిన్ మాట్లాడుతూ  కీవ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఉక్రెయిన్ సేనలకు సూచించారు అప్పుడు ఒప్పందం కుదుర్చుకోవడం మరింత సులభమవుతుందని పేర్కొన్నారు.

రష్యా భద్రతా మండలిలో పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్ దళాలకు తాను మరోమారు విజ్ఞప్తి చేస్తున్నానని, మీ పిల్లలు, భార్యలు, పెద్దలను మానవ కవచాలుగా ఉపయోగించుకోవడానికి నయా-నాజీలను అనుమతించవద్దని, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కోరారు. అంతకు కొద్దిసేపటికి ముందు, ఉక్రెయిన్ ఆర్మీ కనుక ఆయుధాలు విడిచిపెడితే చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ ప్రకటన చేశారు.  ఈశాన్య, తూర్పు వైపుల నుంచి రష్యా సైన్యం కీవ్‌ను చుట్టుముడుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మీ ప్రభుత్వాన్ని కూల్చండి

ప్రస్తుత ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ సైన్యానికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉక్రెయి న్‌లో అధికారంలో ఉన్న వారిని ఉగ్రవాదులు, డ్రగ్ అడిక్ట్‌లు, నయా నాజీల కూటమితో పోల్చిన ఆయన వారిని అధికారంలోంచి దించేయాలని ఆయన పిలుపునిచ్చారు.

‘మీ చేతుల్లోకి అధికారాన్ని తీసుకోండి. అలా చేస్తే ఈ డ్రగ్ అడిక్ట్‌లు, నియో నాజీల గ్యాంగ్‌కన్నా మీతో అంగీకారానికి రావడం మాకు సులువు అవుతుంది’ అని శుక్రవారం ఓ టీవీ చానల్ ద్వారా మాట్లాడుతూ పుతిన్ పేర్కొన్నారు.

‘ఉక్రెయిన్‌లోని మిలిటరీకి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా..అభినవ నాజీలకు మానవ కవచాలుగా మీ పిల్లలు, పెద్దలు, భార్యలను ఉండనీయొద్దు. అధికారాన్ని మీరు హస్తగతం చేసుకోండి’ అంటూ ఉక్రెయిన్ సైనికులకు పుతిన్ సూచించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యూదుడు కావడం గమనార్హం.

మరోవైపు.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలను వ్యతిరేకిస్తూ అనేక మంది రష్యన్లు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. తాము రష్యన్లు అయినందుకు విచారపడుతున్నామని కొందరు, పుతిన్ నిర్ణయాలు రష్యా ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించవంటూ మరికొందరు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా ఉండగా, ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యా సైనిక దళాలు రాజధాని కీవ్ వైపునకు వేగంగా దూసుకెళ్తున్నాయి. అలాగే రష్యా సైనికులు ఉక్రేనియన్ ఆర్మీ యూనిఫాంలోకి మారినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన చేసింది. 

‘ఉక్రెయిన్ సాయుధ దళాలకు చెం దిన రెండు వాహనాలను రష్యన్ మిలిటరీ స్వాధీనం చేసుకుంది. రష్యా సైనికులు ఉక్రేనియన్ యూనిఫాంలను తీసుకుని వాటిని ధరించారు. అనంతరం మా వాహనాల్లో కీవ్‌కు వెళ్తున్నారు. రష్యా ట్యాంకులు వాటిని అనుసరిస్తున్నాయి’ అని ఉక్రెయిన్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ తెలిపారు.