`సుప్రీం’ ముంగిటకు కనకమ్మకు `భారతరత్న అభ్యర్ధన 

ప్రతిష్టాకరమైన పౌర పురస్కారాలైన `పద్మ’ అవార్డులకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. వ్యక్తిగతంగానైనా, వివిధ సంస్థల నుండైనా, రాష్ట్ర ప్రభుత్వాల నుండైనా, లేదా ఇతరుల నుండైనా ప్రతిపాదనలు చేయవచ్చు. కానీ ఆ విధంగా చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో నేరుగా సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించిన సంఘటన ఆసక్తి కలిగిస్తుంది. 

నెల్లూరుకు చెందిన ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు, పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం, కస్తూరి దేవి బాలికల పాఠశాల, జమీందారీ రైతు పత్రిక వ్యవస్థాపకురాలు శ్రీమతి పొణకా కనకమ్మ కు `భారత రత్న’ పురస్కారం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నారు.

గాంధీగారి శిష్యురాలిగా, ఆయన చూపిన మార్గంలో నడచిన ఆమె   తన జమీందారీ జీవితాన్ని పణంగా  పెట్టి, తన యావదాస్తిని  హారతి కర్పూరంలా స్వాతంత్ర సమర ఉద్యమానికి త్యాగం చేసిన మహిళా మూర్తి ఆమె.  ఆమెను `భారతరత్న’ పురస్కారంతో గౌరవించాలని కోరుతూ శ్రీమతి పొణకాకనకమ్మ ఆశయ సాధన సమితి, కన్వీనర్  బి సురేంద్రనాథ్ రెడ్డి చేసిన వినతిని పరిశీలనకు అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. 

అందుకు సహకరించిన ఇళ్ల కలెక్టర్ చక్రధర్ బాబు, ఇతర అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒక సంవత్సరంపాటు జైలులో ఉన్న ఆమె నెల్లూరులో ప్రారంభించిన కస్తూరిబా పాఠశాల అప్పట్లో దేశంలోనే అతిపెద్ద బాలికల పాఠశాల. సంపన్న కుటుంభంలో నెల్లూరు జిల్లా మినగల్లు గ్రామంలో 1892 జూన్ 10న జన్మించిన ఆమెకు 8 ఏళ్ళ వయస్సులోనే వివాహమైంది. సంప్రదాయ కుటుంభం నుండి వచ్చిన భర్త ఆమెను చదువుకు పాఠశాలకు పంపడానికి ఇష్టపడలేదు. అయినా ఆమె తెలుగు, హిందీ, సంస్కృతంలలో సొంతంగా ప్రావిణ్యం సంపాదించింది. 

 1907లో వందేమాతరం ఉద్యమం సందర్భంగా బిపిన్ చంద్రపాల్ భార్యతో కలసి నెల్లూరు కు వచ్చినప్పుడు 16 ఏళ్ళ వయస్సులో వారికి ఆతిధ్యం ఇచ్చారు. బావగారైన పట్టాభిరామిరెడ్డి సహకారంలో సుజనా రంజని సమాజం, వివేకానంద గ్రంధాలయంలను నెల్లూరుకు సమీపంలో పొట్టపూడి గ్రామంలో  ఆమె స్థాపించారు. ఇతర గ్రామాలలో గ్రంథాలయాల స్థాపనకు ప్రోత్సహించడం, హరిజనుల ఉద్ధరణకోసం కృషి చేయడం చేశారు. మూడేళ్లపాటు విప్లవ రాజకీయాలవైపు ఆకర్షిస్తులైన ఆ తర్వాత గాంధీ శిష్యురాలిగా, ఆయన మార్గంలో ప్రయాణము సాగించారు. 

నెల్లూరుకు 8 కిమీ దూరంలోని పల్లెపాడు గ్రామంలో ఆమె కొనుగోలు చేసిన 13 ఎకరాల భూమిని `పినాకిని సత్యాగ్రహం’కు ఇవ్వగా, దానిని మహాత్మా గాంధీ స్వయంగా ఏప్రిల్ 7, 1921న  ప్రారంభించారు. సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహంలలో పాల్గొని రాయవెల్లూరు జైలులో 1930లో 6 నెలలు, 1932లో 13 నెలలు జైలు జీవితం అనుభవించారు. ఆమెతో పాటు జైలులో రాజాజీ, దుర్గాబాయి దేశముఖ్, బెజవాడ గోపాలరెడ్డి వంటి ప్రముఖులు ఉన్నారు. 

1923 అక్టోబర్ 18న విజయదశమి రోజున గాంధీ గారి నిర్మాణాత్మక కార్యక్రమాలలో భాగంగా ఆమె నెలకొల్పిన బాలికల పాఠశాల కస్తూరిబా విద్యాలయంను  టంగుటూరి ప్రకాశం ప్రారంభించారు. మే 12, 1929లో శాశ్వత భవనాలకు గాంధీజీ శంకుస్థాపన చేశారు. 1934లో తన ఏకైక పుత్రిక మృతి చెందడంతో ఆమె రమణ మహర్షి శిస్యురాలయ్యారు. ద్రోణంరాజు లక్షిబాయమ్మతో కలసి తెలుగులో మొదటిసారిగా ఉమ్మడిగా గ్రంధాలు ప్రచురించిన మహిళలు. రమణ యోగి జీవిత చరిత్రను తెలుగు, ఆంగ్లములలో వ్రాసారు. 1963 సెప్టెంబర్ 15న ఆమె నెల్లూరులో మృతి చెందారు.