ప్రపంచం మమ్ముల్ని ఒంటరి చేసింది

ఉక్రెయిన్ పై రెండో రోజు రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ లోని 13 నగరాల్లో రష్యన్ బలగాలు తీవ్రమైన దాడులు చేస్తున్నాయి. తాము ఎక్కడా ప్రజలపై దాడులు చేయడం లేదని చెప్పిన రష్యా.. కొన్ని ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లపై కూడా క్షిపణి దాడులు చేస్తోంది. ఇప్పటికే పలు సిటీల్లో ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, సైనిక స్థావరాలు, డిఫెన్స్ వెపన్ స్టోరేజ్ సెంటర్ పై మిస్సైల్స్, బాంబు దాడులతో ధ్వంసం చేసింది. 
 
అటు కీవ్ కు 130 కిలో మీటర్ల దూరంలో ఉన్న చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్ కేంద్రాన్ని రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కాగా, రష్యన్ ఆర్మీ దాడుల్లో ఇప్పటి వరకు 137 మంది చనిపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ  ప్రకటించారు. తమ దేశాన్ని కాపాడుకునేందుకు పోరాడుతూనే ఉన్నామని, అయితే ఈ యుద్ధంలో ప్రపంచ దేశాలు తమను ఒంటిరిని చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
అయితే ఉక్రెయిన్ వ్యాప్తంగా భారీగా బలగాలు మోహరించినట్లు జెలెన్స్కీ తెలిపారు. మరో 90 రోజుల పాటు బలగాల మోహరింపు ఉంటుందని పేర్కొన్నారు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీరులను హీరోలుగా కీర్తించారాయన. అమరుల త్యాగాలను ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుదని చెప్పారు. 
‘‘మన దేశాన్ని కాపాడుకోవడానికి మనల్ని ఒంటరిగా వదిలేశారు’’ అని వోలోడిమిర్ ఉక్రెయిన్ ప్రజలకు చెప్పారు. మన పక్షాన నిలబడి పోరాడటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. తమ పక్షాన నిలబడి పోరాడటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నట్లు తనకు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వంపై హామీ  ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నిస్తూ, ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 గురువారం ఉదయం దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 137 మంది ఉక్రెయినియన్లు ప్రాణాలు కోల్పోయారని, వీరిలో సైనికులు, సామాన్య ప్రజలు ఉన్నారని చెప్పారు. 316 మంది గాయపడినట్లు తెలిపారు. రష్యన్ విద్రోహ శక్తులు రాజధాని నగరం కీవ్‌లో ప్రవేశించాయని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కర్ఫ్యూను పాటించాలని కోరారు.
తనను టార్గెట్ నెంబర్ వన్‌గా రష్యా గుర్తించినప్పటికీ, తాను, తన కుటుంబ సభ్యులు ఉక్రెయిన్‌లోనే ఉన్నామని తెలిపారు. దేశాధినేతను దెబ్బతీయడం ద్వారా రాజకీయంగా ఉక్రెయిన్‌ను నాశనం చేయాలని రష్యా కోరుకుంటోందని మండిపడ్డారు.
 
శుక్రవారం ఉదయం సెంట్రల్ కీవ్‌లో రెండు భారీ పేలుళ్ళు వినిపించాయి. రష్యన్ సేనలు కీవ్‌ను సమీపిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ సైన్యం ఫేస్‌బుక్ పేజీలో తెలిపిన వివరాల ప్రకారం, కీవ్‌లో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలపై రష్యా దాడులు చేస్తోంది. 
 
రష్యాకు రెండు భయానక బహుమతులను ఇచ్చామని ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తెలిపింది.  కీవ్‌కు సమీపంలోని హోస్టోమెల్ విమానాశ్రయం వద్ద రష్యన్ పారాట్రూపర్లు ల్యాండ్ అయ్యారు, ఇక్కడ భీకర పోరాటం తర్వాత ఈ విమానాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
ఇదిలావుండగా, అమెరికా సీనియర్ డిఫెన్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ, రష్యా సేనలు కీవ్‌కు మరింత చేరువగా వెళ్తున్నట్లు తెలిపారు.  ఉక్రెయిన్‌లో ఈశాన్య దిశలో ఉన్న సుమీ, ఖార్కివ్ ప్రాంతాల్లో భారీగా కాల్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా దక్షిణ దిశలో ఉన్న ఖెర్సోన్ ప్రాంతంలో కూడా ఇరు దేశాల సైన్యాలు భీకరంగా తలపడుతున్నాయి.
కీవ్‌లో దాదాపు 3 మిలియన్ల మంది నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భయానకంగా బాంబు దాడులు జరుగుతూ ఉంటే, ఈ హైవేపై కార్లలో వేలాది మంది చిక్కుకుపోయారు.
ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, దాదాపు 1 లక్ష మంది ఉక్రెయినియన్లు తమ ఇళ్ళను వదిలిపెట్టి పారిపోయారు. వేలాది మంది పొరుగున ఉన్న రుమేనియా, మాల్డోవా, పోలండ్, హంగేరీ దేశాలకు వెళ్లిపోతున్నారు.