తక్షణం దాడులు ఆపండి పుతిన్… మోదీ హితవు 

ఉక్రెయిన్ పై తక్షణం దాడులు ఆపి, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కు హితవు పలికారు. గత రాత్రి ఆయన ఫోన్ లో రష్యా అధ్యక్షునితో మాట్లాడుతూ నెలకొన్న ఉద్రిక్తల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.  రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతల తక్షణ విరమణకు మోడీ విజ్ఞప్తి చేశారు. 
ఉక్రెయిన్‌కు సంబంధించిన తాజా పరిణామాలను పుతిన్ ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు. రష్యా, నాటో కూటమి మధ్య ఉన్న విభేదాలను నిజాయితీ, చిత్తశుద్ధితో కూడిన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలన్న దీర్ఘకాలంగా ఉన్న భారత్ వైఖరిని ప్రధాని ఈ సందర్భంగా పుతిన్‌కు మరోసారి ప్రధాని గుర్తు చేశారు. అందువల్ల తక్షణమే హింసకు స్వస్తి చెప్పి, దీనికి సంబంధించిన అన్ని వర్గాలు కూడా దౌత్యచర్చల మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన కోరారు.

ఉక్రెయిన్‌లోని భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు క్షేమంగా అక్కడినుంచి బైటపడి భారత్‌కు తిరిగి చేరుకోవడానికి భారత్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్న విషయాన్ని మోదీ  రష్యా అధ్యక్షుడికి తెలియజేశారు. కాగా ప్రస్తుత అంశంపై ఇరు దేశాలకు చెందిన దౌత్య బృందంలో నిత్యం టచ్‌లో ఉండేలా చూడాలని ఇరువురు నేతలు అంగీకరించారు. 

ఉక్రెయిన్‌పై దాడులను ఆపేలా పుతిన్‌పై ప్రధాని మోదీ  ఒత్తిడి తీసు కు రావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరడంతో పాటు ఉక్రెయిన్‌లోని భారతీ య విద్యార్థుల క్షేమం పట్ల స్వదేశంలోని అన్ని ప్రాంతాల్లో అందోళన వ్యక్తమవుతున్న తరుణంలో పుతిన్‌తో మోదీ  ఫోన్‌లో సంభాషించారు.

పుతిన్‌,  మోదీ ఫోన్‌ సంభాషణ గురించి ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించింది. సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని పుతిన్‌కు మోడీ విజ్ఞప్తి చేసినట్లు ప్రకటన తెలిపింది. 

వెనుదిరిగిన ఎయిర్ ఇండియా విమానం 
 
కాగా,  ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో అక్కడున్న భారతీయ పౌరులను తీసుకుని రావడానికి బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం ఉక్రెయిన్‌కి చేరకుండానే మధ్యలో వెనుదిరగాల్సి రావడంతో వందల సంఖ్యలో భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం 7.30గంటలకు బయలుదేరిన ఎఐ 1947 విమానం చివరకు ఉక్రెయిన్‌ విమానాశ్రయానికి చేరకుండా ఇరాన్‌కి వెళ్లి, అక్కడ నుండి వెనుదిరగాల్సి వచ్చింది.
వాణిజ్య విమానాల రాకపోకలకు వీల్లేకుండా ఉక్రెయిన్‌ గగనతలాన్ని మూసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. భారత విద్యార్థులను, పౌరులను తీసుకురావడానికి ఎయిర్‌ ఇండియా ఈ వారంలోనే రెండు సార్లు విమానాలు నడిపింది. మంగళవారం 242మంది భారతీయులను తీసుకుని ఎయిర్‌ ఇండియా విమానం కీవ్‌ నుండి ఢిల్లీ చేరుకుంది. వీరిలో ఎక్కువమంది విద్యార్థులే.
షార్జా నుంచి వచ్చిన విమానంలో ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న 30 మంది వైద్య విద్యార్థులు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల్లో సుమారు 350 మంది వరకు తెలుగువారు ఉన్నట్లు సమాచారం. తమ పిల్లలను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాల్సిందిగా తెలుగు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దాదాపు 400 వరకు అభ్యర్థనలు అందాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.
ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ అధికారులను సంప్రదించి విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించాల్సిందిగా కోరినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఇఎ) పేర్కొంది. ఈశాన్య ఉక్రెయిన్‌పై గగనతంలో పౌర విమానాలేవీ తిరగకుండా రష్యా నోటామ్‌ (నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌) జారీ చేసింది. దీంతో పౌర విమానయాన భద్రతకు ముప్పు అని పేర్కొంటూ ఉక్రెయిన్‌ తన గగనతలాన్ని మూసివేసింది. రష్యా కూడా రోస్తావ్‌ సెక్టార్‌లోని కొన్ని విమానాశ్రయాలను మూసివేసింది.
16 వేల మందిని తరలించే ప్రయత్నం 
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి 16,000 మంది భారతీయులను తరలించే ప్రణాళికను రచిస్తోంది. భారత ప్రభుత్వం పోలాండ్, రొమానియా, హంగరీ, స్లోవాకియాల సాయంతో వారిని తరలించాలనుకుంటోంది. ఈ విషయంలో విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఆ దేశాల విదేశాంగ మంత్రులతో చర్చించనున్నారు. 
 
విదేశాంగ మంత్రిత్వ శాఖ కథనం ప్రకారం రష్యా దాడి చేస్తుందని భావించే ఉక్రెయిన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం భారతీయుల రిజిస్ట్రేషన్‌ను నెల కిందటే ఆరంభించింది. ఉక్రెయిన్‌లో విద్యార్థులు సహా 20000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఇప్పటికే 4000 మంది రష్యా ఉక్రెయిన్‌పై ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌ను ప్రకటించక ముందే ఉక్రెయిన్‌ను వదిలిపెట్టారు.