భారత్ సాయం కోరిన ఉక్రెయిన్‌ .. చిక్కుకున్న భారతీయ విద్యార్థులు

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితుల్లో వైద్య విద్య తదితర కోర్సుల కోసం ఆ దేశంలో ఉంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు అక్కడ చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.  ఉక్రెయిన్‌పై తాజాగా రష్యా దాడులకు పాల్పడిన నేపథ్యంలో స్వదేశంలోని తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
మరోవంక, ఉక్రెయిన్‌ ఇప్పటికే భారత్‌ సాయాన్ని కోరింది. ఉద్రిక్తతలను తగ్గించ గల శక్తి భారత్‌కు ఉందని, ఈ నేపథ్యంలో తమకు అండగా నిలవాలని ఉక్రెయిన్‌ రాయబారి ఇగోర్‌ పొలిఖా కోరారు. రష్యా-ఉక్రెయిన్‌ విషయంలో ప్రధాని మోదీ  జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్లిష్ట సయమంలో తమకు అండగా నిలవాలని భారత్‌ను ఉక్రెయిన్‌ కోరింది.
చాలా సందర్భాల్లో భారత్‌ శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించిందని, రష్యాతో భారత్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని, ఈనేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించడంలో భారత్‌ కీలక పాత్ర పోషించగలదని భావిస్తున్నట్లు పొలిఖా తెలిపారు. ఈ విషయంపై భారత ప్రధాని మోదీ పుతిన్‌తో మాట్లాడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పుతిన్‌ ఎవరీ మాటా వింటారో తెలియదని, కానీ మోదీ మాట వినొచ్చునన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ మంత్రులతో అత్యవసర సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడాలని ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
 
కాగా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల్లో సుమారు 350 మంది వరకు తెలుగువారు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమ పిల్లలను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాల్సిందిగా తెలుగు విద్యార్థులకు సంబంధించి వారి తల్లిదండ్రులు నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దాదాపు 400 వరకు అభ్యర్థనలు అందాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. 
 
దీంతో ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ అధికారులను సంప్రదించి విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించాల్సిందిగా కోరినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) పేర్కొంది. రష్యాపై ఆంక్షల అమల్లో భారతీయ అమెరికన్లదే కీలక పాత్ర. 
 
ఈ మేరకు ఎంఈఏ అధికారులు ఉక్రెయిన్‌లోని తెలుగు మాట్లాడే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విద్యార్థుల నివాస చిరునామాలకు సంబంధించి తెలంగాణ ఎన్నారై సెల్‌ అధికారుల నుండి సమాచారాన్ని కూడా కోరారు. 
 
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన సుమారు 350 మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయని ఎంఈఏ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం భారత్‌ నుంచి ఉక్రెయిన్‌కు ఒక్క ఎయిరిండియా మాత్రమే విమాన సర్వీసులు నడిపిస్తోంది. 
 
ఇక అక్కడ చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను తరలించేందుకు ఈ నెల 22, 24, 26 తేదీల్లో భారత ప్రభుత్వం మూడు ప్రత్యేక ఎయిర్‌ ఇండియా విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగానే బుధవారం కొంతమంది భారత విద్యార్థులను అధికారులు స్వదేశానికి తీసుకొచ్చారు. 
 
మరోవైపు ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో భారత్‌ తటస్థంగా వ్యవహరిస్తుండటాన్ని స్వాగతిస్తున్నట్లు రష్యా పేర్కొంది. ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలెట్టింది.