ఇమ్రాన్ ఖాన్ కు రష్యాలో ఓ జూనియర్ మంత్రి స్వాగతం 

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు రష్యాలో పరాభవం జరిగింది. రెండు రోజుల పర్యటన కోసం మాస్కో చేరుకున్న ఆయనకు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ కాకుండా ఆ దేశ జూనియర్ మినిస్టర్ స్వాగతం పలికారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్న సమయంలో బుధవారం ఆయన పాకిస్థాన్ నుంచి బయల్దేరారు. 
రష్యాతో సంబంధాల్లో ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితులను సర్దుబాటు చేసుకోవాలన్న లక్ష్యంతో ఇమ్రాన్ ఖాన్ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఇంధన రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడం ఆయన ప్రధాన లక్ష్యం. ఓ పాకిస్థానీ ప్రధాన మంత్రి రష్యాలో పర్యటించడం సుమారు రెండు దశాబ్దాల్లో ఇదే మొదటిసారి.
ఇమ్రాన్ ఖాన్ పర్యటన గురించి పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్ వేదికగా వివరించింది. ఇమ్రాన్ ఖాన్‌కు రష్యా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఐగోర్ మోర్గులోవ్ స్వాగతం పలికినట్లు తెలిపింది.
ఇమ్రాన్ ఖాన్‌తో పాటు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ, సమాచార శాఖ మంత్రి ఫవద్ చౌదరి, ప్రణాళిక, అభివృద్ధి శాఖ మంత్రి అసద్ ఉమర్, ఆర్థిక సలహాదారు అబ్దుల్ రజాక్ దావూద్, జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసఫ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.
ఈ నెలలో ఇది ఇమ్రాన్ రెండో విదేశీ పర్యటన. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ కోసం ఆయన చైనాలో పర్యటించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నుంచి కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇమ్రాన్ కోరుకుంటున్నారు. గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టు కోసం సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పరిశీలకులు చెప్తున్నారు.