రష్యా యుద్ధానికి దిగడం పట్ల భారత్ ఆందోళన 

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడం యావత్ ప్రపంచానికీ ఆందోళన కలిగించే అంశమని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని, శాంతిని నెలకొల్పాలని ఆయన కోరారు. 
 
ఈసంక్షోభ విషయంలో భారత్ తటస్థ వైఖరిని ఎంచుకుందని, ఏ దేశం వైపూ మొగ్గు చూపబోదని ఆయన స్పష్టం చేశారు. ఆ రెండు దేశాలు శాంతియుత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్,  శాంతి భద్రతలకు విఘాతం కలిగి రెండు దేశాలు పెను సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని పేర్కొంది. 

ఉక్రెయిన్ విడిపోయిన ప్రాంతాలైన డొనెట్స్క్ , లుహాన్స్క్‌లలోకి రష్యా  సైన్యానికి దాడులకు ఆదేశించిన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి ఈ ప్రకటన చేశారు. ఈ ప్రాంతాల అధిపతులు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను సహాయం కోరిన తర్వాత ఉక్రెయిన్ అత్యవసర ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశాన్ని అభ్యర్థించింది.

ఉద్రిక్తతలను తక్షణం తగ్గించాలన్న భారత్ పిలుపును పునరుద్ఘాటిస్తూ తిరుమూర్తి, పరిస్థితి పెను సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జాగ్రత్తగా నిర్వహించకపోతే, శాంతి భద్రతలకు భంగం కలిగించే పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 

“వెంటనే తీవ్రతను తగ్గించాలని, పరిస్థితిని మరింత దిగజార్చడానికి దోహదపడే తదుపరి చర్యలకు దూరంగా ఉండాలని మేము పిలుపునిస్తాము. విభిన్న ప్రయోజనాలను తగ్గించడానికి అందరూ మరింత కృషి చేయాలని మేము అన్ని పక్షాలను పిలుస్తున్నామని” ఆయన పేర్కొన్నారు. 

సంయమనం పాటించడం ద్వారా అన్ని పక్షాలు శాంతి భద్రతలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సంబంధిత దేశాల మధ్య నిరంతర దౌత్య చర్చలతోనే సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. 

ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థులతో సహా భారతీయ పౌరులందరికీ భారత్ తిరిగి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.

కాగా, ప్రపంచ దేశాల ఒత్తిడిని లెక్క చేయకుండా రష్యా రాత్రికి రాత్రి ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది. మూడు వైపుల నుంచి రష్యన్ బలగాలు చుట్టుముట్టి దాడులు చేస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనేక సిటీలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడులపై ఉక్రెయిన్ కౌంటర్ అటాక్ కు దిగింది. 
 
తాము రష్యాను ఎదుర్కొని గెలుస్తామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులెబా భరోసా వ్యక్తం చేశారు. అయితే ప్రపంచ దేశాలు కూడా తమకు సాయం చేయాలని, యుద్ధ సామాగ్రితో పాటు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలని ఆయన కోరారు. అలాగే రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించాలని, ఆ దేశ దురాక్రమణను నిలువరించాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. 
 
ఇప్పటికే అమెరికా, బ్రిటన్, సహా పలు నాటో దేశాలు.. ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తామని బహిరంగంగా ప్రకటించాయి. చైనా మాత్రం రష్యాకు మద్దతు ఇస్తున్నది.