భగ్గుమన్న చమురు ధరలు … బ్యారెల్ 105 డాలర్లు

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టడంతో, చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్యారెల్‌ ముడి చమురు ధర ఏకంగా 105 డాలర్లకు చేరింది. గత ఏడేళ్లలో ఇదే గరిష్టం. ఉక్రెయిన్‌ సరిహద్దుల వద్ద రష్యా దళాల మోహరింపులప్పటి నుంచి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 
 
ప్యూచర్‌ మార్కెట్‌లో చమురు ధర ఒక్క పూటలోనే తొమ్మిది శాతం పెరిగి 105.3 డాలర్లకు చేరింది. 2014 సెప్టెంబర్‌లో బ్యారెల్‌ ధర వంద డాలర్లుగా ఉంది. 2021 డిసెంబర్‌ మాసంలో చమురు ధర 74 డాలర్లుగా ఉంది. ఈ ఏడాది జనవరిలో ఇది 85 డాలర్లకు చేరింది. యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమైతే చమురు పరిశ్రమపై ప్రభావం పడటంతో పాటుగా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
 రష్యా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. ఇది ప్రధానంగా యూరోపియన్‌ రిఫైనరీలకు ముడి చమురు విక్రయిస్తుంది. 
 
ఎన్నికల నేపథ్యంలో గత 110 రోజుల నుంచి మనదేశంలో చమురు ధరలు పెరగలేదు. ఇప్పటికే అంతర్జాతీయ ధరలు పెరిగినా ఇక్కడ పెంచలేదు. ఇంతలో ఉక్రెయిన్ సంక్షోభం ఎదురు కావడంతో మార్చి మొదటి వారంలో ఎన్నికలు పూర్తవగానే పెట్రో, డీజిల్‌ ధరలు భారీగా పెరగనున్నాయని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. 
 
లీటర్ కు రూ 10 నుండి రూ 15 వరకు రాబోయే నెలరోజులలో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.   భారీగా పెరిగిన క్రూడాయిల్‌ ధరల వల్ల వాహనదారులే కాకుండా, రవాణా ఖర్చులు పెరగడంతో అన్ని ధరలు మరింతగా భగ్గుమనే అవకాశాలున్నాయి. ఈ వార్తలు దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.