దళితులను అన్ని రకాలుగా దగా చేస్తున్న వైసిపి ప్రభుత్వం 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం దళితులను అన్ని రకాలుగా దగా చేస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. పోస్టు మెట్రిక్‌ ఉపకార వేతనాలు పొందే వారి సంఖ్యను మూడు లక్షలు కుదించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం దళిత వర్గాల అభివృద్ధికి అనేక పథకాలు తీసుకొచ్చి అమలు చేస్తుంటే..రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ నిధులను పక్కదారి పట్టించి మోసం చేస్తోందని ఆరోపించారు. రానున్న రోజుల్లో పీఎం కిసాన్‌ యోజన పథకంలో నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లుగానే ఎస్సీ వర్గాల పథకాల సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లోనే వేసేందుకు కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. 

ఇదే సమయంలో ప్రభుత్వ విధానాలపై బీజేపీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టనున్నామని జివిఎల్ వెల్లడించారు.  ఏపీ బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల మంజూరు డిమాండ్‌ చేస్తూ నిరసన దీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జీవీఎల్‌ నరసింహారావు ఐదేళ్లలో కేంద్రం పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్పుల కోసం రూ.60వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఈ పథకంలో నాలుగు కోట్ల మంది దళిత విద్యార్థులు ప్రయోజనం పొందుతారని తెలిపారు. గతంలో ఏపీ నుంచి 6.70లక్షల మంది పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌ షిప్పులు తీసుకోగా ప్రస్తుతం 3.60లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు.

మిగిలిన మూడు లక్షల మంది విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని జీవీఎల్‌ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్పులను ఈ ఏడాది నుంచి విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు తెలిపారు. దళిత యువతీ, యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ నుంచి 90శాతం నిధులు ఇస్తుంటే దారి మళ్లించి ఇతర పథకాలకు వాడుతున్నారని ఆరోపించారు.

గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ నిధులతో కొనుగోలు చేసిన వాటిపై తన ఫొటోలు ముద్రించుకుంటే, ప్రస్తుత ప్రభుత్వం వేర్వేరు పథకాలకు మళ్లిస్తోందని ఆరోపించారు. అంబేద్కర్‌ను రాజకీయంగా వాడుకుంటున్నారే తప్ప ఆయన స్ఫూర్తిని కొనసాగించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అయితే ప్రధాని మోదీ అంబేద్కర్‌ స్ఫూర్తికి చిహ్నంగా పంచతీర్థాల నిర్మాణం చేపడితే ఇక్కడ కనీసం విగ్రహాలు కూడా పెట్టడం లేదని మండిపడ్డారు.

ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతిని ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ను అవమానించేలా రాజ్యాంగంపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆయన కోరారు. ఎస్సీ రిజర్వేషన్లు పొందేవారు ఖచ్చితంగా హిందువులుగానే ఉండాలని పేర్కొంటూ లేని పక్షంలో వారి వారి ఉద్యోగ, రాజకీయ పదవులు కోల్పోక తప్పదని జీవీఎల్‌ హెచ్చరించారు.