తెలుగు రాష్ట్రాలకు మరో రెండు హైవేలు

ఏపీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రెండు జాతీయ రహదారులను మంజూరుచేసింది. భారత్‌మాలా పరియోజనలో భాగంగా రూ.2824.18 కోట్ల వ్యయంతో రెండు ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 
 
అందులో సోలాపూర్‌-కర్నూలు-చెన్నై ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా రూ.972.06 కోట్లతో ఎన్‌హెచ్‌ 150సీ పై తెలంగాణ-కర్ణాటక సరిహద్దు (రాయచూర్‌ గద్వాల రోడ్డు నుంచి) నుంచి గద్వాల జిల్లాలోని జూలకల్‌ గ్రామం వరకు ఆరు లైన్ల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే మంజూరు చేశామని పేర్కొన్నారు. 
 
అలాగే, రూ.1852.12 కోట్ల వ్యయంతో ఎన్‌హెచ్‌ 71పై చిత్తూరు జిల్లా మదనపల్లి-పీలేరు వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టనున్నామని వివరించారు.

పోలవరం పనుల వేగం పెంచాలి

పోలవరం ప్రాజెక్టు పనులను త్వరతగతిన పూర్తి చేసేందుకు పనుల్లో వేగం పెంచాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం బుధవారం జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో పోలవరం ప్రాజెక్టు పనులు, ఆర్‌ఆర్‌ ప్యాకేజీ, పునరావాసం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సమీక్షా సమావేశం నిర్వహించింది.

మంగళవారం జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జలవనరులశాఖ కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఇఎన్‌సి నారాయణరెడ్డి, పోలవరం సిఇ సుధాకర్‌బాబు తదితరులు పాల్గన్నారు. ప్రాజెక్టులో కీలకమైన పునరావసం, ఆర్‌ఆర్‌ ప్యాకేజీ పనులపై కేంద్రం ఆరా తీసింది.

అలాగే దిగువ కాఫర్‌డ్యామ్‌, ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు, పెండింగ్ బిల్లుల చెల్లింపు గురించి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు.