రాష్ట్ర ప్రభుత్వం వల్లనే తెలంగాణలో రైల్వేలో జాప్యం 

తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం కారణంగా ప్రోజెక్టుల అమలులో జాప్యం జరుగుతున్నదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రైల్వే అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ సీఎం కేసీఆర్‌కు ఆదివారం లేఖ రాశారు.
తెలంగాణకు 2022-23 రైల్వే బడ్జెట్‌లో రూ.3,048కోట్లు కేటాయించామని వెల్లడించారు. గత ఏడాది కంటే ఈసారి 26 శాతం నిధులు అదనంగా ఇస్తున్నామని తెలిపారు. 2014 నుంచి బడ్జెట్‌ కేటాయింపులను పరిశీలిస్తే దాదాపు మూడింతలు పెరిగాయని పేర్కొన్నారు.
 రైల్వే లైన్ల డబ్లింగ్‌, కొత్త లైన్లు, మూడో లైను, ఎలక్ట్రిఫికేషన్‌, రోడ్లు, వంతెనల నిర్మాణం తదితర పనులు చేపడుతున్నట్లు కిషన్‌రెడ్డి వివరించారు. తెలంగాణలో 1,300 కి.మీ దూరం రైల్వే పనులు జరుగుతున్నాయని తెలిపారు. భూసేకరణ, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల బదలాయింపులో జాప్యం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు. ఇందుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల బదలాయింపు ప్రక్రియను త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జాప్యం జరుగుతున్న పనుల్లో.. కాజీపేట-విజయవాడ (220 కి.మీ), కాజీపేట-బల్లార్షా (201 కి.మీ), మణుగూరు-రామగుండం (200 కి.మీ), మనోహరాబాద్‌-కొత్తపల్లి (151 కి.మీ), కృష్ణా-వికారాబాద్‌ (145 కి.మీ), బోధన్‌-లాథూర్‌ (134 కి.మీ), కొండపల్లి-కొత్తగూడెం (82 కి.మీ), మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ (66 కి.మీ), కరీంనగర్‌-హసన్‌పర్తి రోడ్‌ (62కి.మీ), భద్రాచలంరోడ్‌-సత్తుపల్లి (54 కి.మీ), అక్కన్నపేట-మెదక్‌ (17 కి.మీ), కాజీపేట్‌-హసన్‌పర్తి రోడ్‌ (11 కి.మీ) ఉన్నాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

బండి సంజయ్ బహిరంగ లేఖ

మరోవంక, ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సెర్ఫ్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్టు కార్మికులు ఉండబోరని, వారిని పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొన్నారు. మహిళా సంఘాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని నమ్మబలికిన ప్రభుత్వం ప్రైవేటు సంస్థలవైపు మొగ్గు చూపుతోందని మండిపడ్డారు.

సెర్ఫ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం ఎప్పుడు పర్మినెంట్ చేస్తుందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ను  సైతం క్రమబద్దీకరించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన సౌకర్యాలు కల్పించాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.