గవర్నర్ను రాష్ట్ర ప్రభుత్వం అవమానించింది

ఈ నెల 19న మేడారం జాతరలో గవర్నర్ తమిళిసై పర్యటించారు. ఆమె పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ పాటించకుండా గవర్నర్ ను రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి  ఈటల రాజేందర్ విమర్శించారు.  మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు వెళ్లిన  గవర్నర్ కు స్వాగతం, వీడ్కోలు పలికేందుకు ఏ ఒక్క మంత్రి గానీ, కనీసం జిల్లా కలెక్టర్, ఎస్పీ వంటి అధికారులు గానీ రాకపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రథమ పౌరురాలి మేడారం పర్యటనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పటివరకు స్పందించకపోడం దురదృష్టకరమని అంటూ విచారం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి చూస్తే ఇదంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందనే అనుమానం కలుగుతోందని ఆయన విమర్శించారు. 

ఈ సంఘటన ద్వారా రాజ్యాంగ వ్యవస్థలపై కేసీఆర్ కు గౌరవం లేదనే విషయం మరోసారి స్పష్టమైందని ఈటల ధ్వజమెత్తారు. పీఎం మోదీని కేసీఆర్ ఎన్ని మాటలన్నా.. కేసీఆర్ పుట్టిన రోజున మోదీ  తనకు ఫోన్ చేసి విషెస్ చెప్పారని ఈటెల గుర్తు చేశారు. 

కానీ కేసీఆర్ సంస్కారహీనుడని, ఎవరినీ లెక్కచేయడని విమర్శించారు. సీఎం బిజీగా ఉంటే కనీసం మంత్రులనైనా పంపాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని రాజేందర్  డిమాండ్ చేశారు. 

నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేస్తుండు

ఇలా ఉండగా, రాష్ట్రంలో నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని రాజేందర్ ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం సాగదీత ధోరణితో వ్యవహరిస్తోందని తప్పుబట్టారు.  రాష్ట్రంలో లక్షా 91 వేల 126 ఖాళీలు ఉన్నాయని 2021లోనే పీఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని ఆయన తెలిపారు. . రెండోసారి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ సర్కారు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్న విషయాన్ని ఈటల గుర్తుచేశారు. 
 
దేశ భవిష్యత్తులో భాగం కావాల్సిన తెలంగాణ యువత ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావడం బాధాకరమని ఆయన  ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ ఉద్యోగాల ఖాళీలపై ఒక రిపోర్ట్ విడుదల చేశారని, దాని ప్రకారమే లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని చెప్పారని గుర్తు చేశారు. 
 
ఇందులో టీఎస్పీఎస్సీ కేవలం 31 వేల ఉద్యోగాలను మాత్రమే నింపిందని పేర్కొన్నారు. అయితే ఆర్టీసీలో నాలుగున్నర వేల ఉద్యోగాలు నింపామని ప్రభుత్వం చెప్పిందని, ఇది పచ్చి అబద్ధమని ఈటల ధ్వజమెత్తారు. తెలంగాణ  వచ్చిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా గ్రూప్ -1, టీచర్ల రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేయలేదని పేర్కొన్నారు.
 
రాజకీయాలపై  ఉన్న సోయి  కేసీఆర్ కు.. నిరుద్యోగ యువతకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడంపై  లేదని దుయ్యబట్టారు. సిస్టమ్ ను  కంట్రోల్ చేసే  సత్తా  లేక ధర్మగంట  పేరుతో  ఉద్యోగుల పరువు  తీశాడని ఈటల రాజేందర్  మండిపడ్డారు.