
యూపీ ప్రజలు హోలీ రెండు సార్లు ఆడేందుకు సన్నాహాల్లో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మార్చ్ 10వ తేదీన బీజేపీ భారీ విజయం సాధించిన తర్వాత ఒకసారి హోలీ చేసుకుంటారని చెబుతూ, మార్చి 10వ తేదీ హోలీకి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో మోదీ మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో బీజేపీకి ప్రజల ఓట్లు పడుతున్నట్టు ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.
”ఇవాళ మూడో విడత పోలింగ్‌లో కూడా బీజేపీకి అనుకూలంగా భారీగా ఓటింగ్ జరుగుతోంది. యూపీతో పాటు పంజాబ్‌లో కూడా పోలింగ్ జరుగుతోంది. అక్కడి ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో రాష్ట్రాభివృద్ధి, పంజాబ్ భద్రత, దేశ సమగ్రత కోసం బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు” అని మోదీ తెలిపారు.
యూపీలో తదుపరి విడత పోలింగ్ బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని, బుజ్జగింపు రాజకీయాల కోసం మన పండుగలను అడ్డుకుంటున్న వారికి మార్చి 10వ తేదీ (ఎన్నికల ఫలితాల రోజు) ఫలితాలతో గట్టి సమాధానం ఇవ్వాలని ప్రధాని కోరారు.
సమాజ్‌వాదీ పార్టీని ”కుటంబపాలకులు” (పరివార్‌వాదీలు) అంటూ ప్రధాని మరోసారి విమర్శలు గుప్పిస్తూ 2014-2017లో పరివార్‌వాదీలు తనకు సహకరించలేదని చెప్పారు. తాను గతంలో యూపీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నానని, 2017 వరకూ ఈ కుటుంబ పాలకులు తనను రాష్ట్ర ప్రజల కోసం పనిచేయనీయలేదని విమర్శించారు.
”ఇప్పుడు అదే కుటుంబపాలకులను మీరు ఎన్నుకుంటే నన్ను ప్రజల కోసం పనిచేయనిస్తారా? అలాంటి వ్యక్తులు మళ్లీ ఎన్నికకావాలా?” అని మోదీ ప్రశ్నించారు. యూపీలోని కుటుంబపాలకులు ఇప్పుడు కులం పేరుతో విషం జిమ్ముతున్నారని మోదీ విమర్శించారు.
వాళ్లలో వాళ్లే కుర్చీ కోసం కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏ కుటుంబానికి చెందినది కాదని, కేంద్రంలోని ప్రభుత్వం కూడా కుటుంబ పార్టీ కాదని మోదీ స్పష్టం చేశారు. పేదలు, రైతులు, యువత కోసం పనిచేసే ప్రభుత్వం తమదని చెప్పారు.
బీజేపీతో పొత్తుపై ఎన్నికల తర్వాత నిర్ణయం
ఇలా ఉండగా, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకుంటామని శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) నేత బిక్రమ్ సింగ్ మజిథియా చెప్పారు. ఆయన ఆదివారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ పంజాబ్ ప్రజల కోసమే తన పోరాటమని, తూర్పు అమృత్‌సర్ నియోజకవర్గానికి అభివృద్ధి అవసరమని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతూ, అహంకారం అణగిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనను ప్రజలు ఐదేళ్ళు గమనించారన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మజిత, తూర్పు అమృత్‌సర్ నియోజకవర్గాల నుంచి బిక్రమ్ సింగ్ మజిథియా పోటీ చేస్తున్నారు. తూర్పు అమృత్‌సర్‌లో పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూతో తలపడుతున్నారు.
ఇదిలావుండగా, శిరోమణి అకాలీ దళ్ నేత గుర్‌బచ్చన్ సింగ్ కూడా బీజేపీతో పొత్తు అవకాశాల గురించి మాట్లాడారు. ఆయన గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పంజాబ్‌లో ఎస్ఏడీ-బీఎస్‌పీ కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందనే నమ్మకం తమకు ఉందన్నారు. ఎమ్మెల్యేల సంఖ్య తగ్గితే బీజేపీ మద్దతు కోరడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ తమ ప్రథమ శత్రువు అని స్పష్టం చేశారు.
More Stories
ఉగ్రదాడి కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం