భారత్‌పై కన్నేసిన దావూద్‌ ఇబ్రహీం… హైదరాబాద్ అప్రమత్తం

దావూద్‌ ఇబ్రహీం భారత్‌పై కన్నేశాడని, ఎంపిక చేసిన వారిపై దాడులకు పధకాలు వేస్తున్నాడని  జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో దావూద్ నగరంపై పట్టుపెంచుకోవడానికి, తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
 
అయితే  దావూద్ ముఠాతో సంబంధాలు, సానుభూతి గల శక్తులు హైదరాబాద్ చెప్పుకోదగిన సంఖ్యలో ఉండడం గమనార్హం. అవకాశం వస్తే చేతులు కలిపి, దౌర్జన్యాలు, దోపిడీలు చేయడానికి సిద్దమే. పరోక్షంగా రాజకీయ అండ లభించే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకనే  తిరిగి అటువంటి ప్రయత్నం చేయవచ్చని పోలీసులు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. 
 
అప్పటి  పోలీసులు అతడి అనుచరులను పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. దావూద్‌ పేరు చెప్పుకొని డాన్‌లుగా ఎదగాలని చూసిన కొందరు పోలీసుల చేతిలో మట్టికరిచారు. 1990 నుంచి 2010 వరకు చాలా యాక్టివ్‌గా ఉన్న దావూద్‌.. తన ప్రధాన అనుచరుడు చోటా షకీల్‌ ద్వారా  మహ్మద్‌ హనీఫ్‌ అనే వ్యక్తి ఆధ్వర్యంలో కొంతమందిని నగరంలో రంగంలోకి దింపారు.
 
 2001లో ఆబిడ్స్‌, పాతబస్తీ పరిధిలోని కొంతమంది డైమండ్‌ వ్యాపారులను బెదిరించారు.  దాంతో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగి ముఠాలో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వారిని విచారించగా మహ్మద్‌ హనీఫ్‌, చోటా షకీల్‌, అబూసలెం పేర్లు వెల్లడించారు. వారు చెబితేనే తాము బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులకు చెప్పారు.
అదే ఏడాది అలీ-బిన్‌-సయీద్‌, 2008 అలీ సయీద్‌లతోపాటు ఆరుగురి ఆట కట్టించారు. ఆ తర్వాత కొంతకాలానికి 2008లో అజీజ్‌రెడ్డి అలియాస్‌ బాబారెడ్డి తనను తాను అండర్‌వరల్డ్‌ డాన్‌గా చెప్పుకొని ప్రచారం చేసుకున్నాడు. దావూద్‌తో సంబంధాలు పెట్టుకొని డాన్‌గా ఎదిగేందుకు ప్రయత్నించాడని ప్రచారం జరిగింది.
అతడి కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెంటాడగా, వారిపైకి కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో మృతి చెందాడు. అదే ఏడాది ఆలీబాయ్‌, ఆఫ్తాబ్‌ అనే వ్యక్తులు డి. గ్యాంగ్‌ (దావూద్‌ గ్యాంగ్‌)గా ప్రచారం చేసుకొని హైదరాబాద్‌లో బెదిరింపులకు, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ఆ తర్వాత పోలీసులకు చిక్కారు.
వారిని విచారించగా.. నగరంలో 40 ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడినట్లు వెల్లడించడంతో వారు కటకటాలపాలయ్యారు. అక్కడితో వారి కథ ముగిసింది. 2009లో చోటారాజన్‌ పేరు వెలుగులోకి వచ్చింది. అతని అనుచరులైన అక్తర్‌, మసూద్‌, అక్బర్‌లు బెదిరింపులు, వసూళ్లకు పాల్పడుతుండటంతో ఉప్పల్‌ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
ఆ తర్వాత దావూద్‌ ప్రధాన అనుచరుడు చోటా షకీల్‌ 2013లోనూ మరోసారి నగరంపై పట్టుకోసం పాకులాడాడు. అతని అనుచరుడు అబ్ధుల్‌ కబీర్‌ను రంగంలోకి దింపాడు. అయినా ఏమీ చేయలేకపోవడంతో చేతులెత్తేశాడు.  హైదరాబాద్‌ పోలీసులు ఎప్పటికప్పుడు వారి ఎత్తులను చిత్తు చేస్తుండటంతో డి గ్యాంగ్‌ పేరు చెప్పుకొని డాన్‌లుగా ఎదగాలని ప్రయత్నించిన వారంతా పోలీసులకు చిక్కి చుక్కలు చూశారు. 2013 తర్వాత సైలెంట్‌ అయిన దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌ హైదరాబాద్‌పై ఆశలు వదులకుంది.