కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేయడం పక్కా… జగ్గారెడ్డి

కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేయడం పక్కా… వెనక్కి తగ్గేదేలేదని టి.పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుండబద్దలు కొట్టేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్టానికి లేఖ రాసిన ఆయన తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ”ఇవాళే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా, కానీ, 3-4 రోజులు టైం తీసుకొని ఆలోచించుకోమని సీనియర్లు చెప్పారు. అందుకే ఆగాను.. సమయం తీసుకున్నా. రాజీనామాపై వెనక్కి తగ్గేదే లేదు. ఎవరికీ భయపడేది లేదు, ఎవరికీ జంకేది లేదు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లిపోవాలనే లైన్‌ తీసుకున్నాను” అని స్పష్టం చేశారు. 

“నేను పార్టీలో ఉండి ఎందుకు ఇబ్బంది పడాలి. కాంగ్రెస్‌ను ఎందుకు ఇబ్బంది పెట్టాలి. నేను చిన్నతనం నుండే రాజకీయాలు చేశా. చదువు కంటే సర్వీస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం నా స్వభావం. ప్రతీదీ రాజకీయ కోణంలో చూడను” అని స్పష్టం చేశారు. 

రాజకీయాల్లో పోటీ సహజం. ప్రయత్నం చేయడం సహజమే. కోపం ఉన్నా ఎదురుగానే చెప్తా. ఓ వ్యక్తి సిస్టంని పాడు చేస్తుంటే తప్పని చెప్తా. నేను నిక్కచ్చితంగా ఉంటా. అందుకే నాపై మీడియా అటెన్షన్‌ ఉంటుంది. నేను ఒకే విషయంలో డిస్ట్రబ్‌ అయ్యా. నా వల్లనే పార్టీ డిస్ట్రబ్‌ అవుతుంది అని చర్చ చేస్తున్నారు.దానిపై నేను సైలెంట్‌గా ఉండటం మంచిది అనుకున్న… అని వివరించారు. 

అయితే, తనపై  కోవర్ట్‌ అనే ముద్ర వేసి ప్రచారం చేయడం తనకు  బాధ అనిపించిందని చెప్పారు. దీంతో పార్టీ వదిలి వెళ్లాలని అనుకున్నానని తెలిపారు. గతంలో తెలంగాణకి వ్యతిరేకంగా కామెంట్స్‌ చేశానని గుర్తు చేస్తూ  అలాంటి సందర్భంలో కూడా నేను అనుకున్న విషయం ఓపెన్‌ గా చెప్పానని పేర్కొన్నారు.  

“జగ్గారెడ్డి వల్ల పార్టీ దెబ్బతింటుంది అని సోషల్‌ మీడియాలో రాయిస్తున్నారు.. నా మీద బురద జల్లుతున్నారు. కాబట్టే నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. ఇక, సోనియా, రాహుల్‌ కుటుంబం గొప్ప చరిత్ర కలిగిన కుటుంబం. అందుకే సీఎం కేసీఆర్‌. అస్సాం సీఎం కామెంట్స్‌ పై స్పందించారని అభిప్రాయపడ్డాను ” అని జగ్గారెడ్డి తెలిపారు.

అయితే తాను పార్టీ వీడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏం లేదని స్పష్టం చేశారు. పార్టీకి నాయకులు ముఖ్యం కాదు. చాలా మంది వస్తుంటారు.. పోతుంటారు.  ఇమేజ్‌ కాపాడుకోవడం తనకు ముఖ్యం అని తెలిపారు.  తాను  పార్టీ విడిచి పెట్టినా.. సోనియా, రాహుల్‌ గాంధీలకు మర్యాద పూర్వకంగా ఉంటానని స్పష్టం చేశారు.