గోదావరి- కావేరి నదుల అనుసంధానంపై తెలుగు రాష్ట్రాల మొండి వాదన

నదుల  అనుసంధానంలో భాగంగా మొదటనే గోదావరి- కావేరి నదుల అనుసంధానం చేపట్టి, డిపిఆర్ ను కూడా కేంద్రం సిద్ధం చేయగా, రెండు తెలుగు రాష్ట్రాలు మొండివాదనల్తో అడ్డు పడుతున్నాయి. గోదావరి నదిలో మిగులు నీటి లభ్యతను లెక్క తేల్చాకే ముందుకెళ్లాలని తెలంగాణ స్పష్టం చేస్తుండగా, అనుసంధానాన్ని పోలవరం నుంచి ప్రారంభించాలని ఏపీ పట్టుబడుతున్నది. 
గోదావరికావేరి నదుల అనుసంధానంపై కేంద్ర జలశక్తి శాఖ శుక్రవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది.  కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన నీటి పారదుల శాఖల అధికారులు పాల్గొన్నారు. 

గోదావరి నదిలో మిగులు జలాలను ఇచ్చంపల్లి నుంచి 247 టిఎంసిఎలు తరలించి కావేరినదిలో కలిపేందుకు రూపొందించిన సమగ్ర పథకం నివేదికను కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశంలో చర్చకు పెట్టి భాగస్వామ్య రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. మూడు దశలుగా ఇచ్చంపల్లి – నాగార్జున సాగర్, నాగార్జున సాగర్‌ – సోమశిల, సోమశిల-కావేరి గ్రాండ్ అనికట్ వరకూ నీటి తరలింపుకి సంబంధించి రూపొందించిన డిపిఆర్‌పై ఈ సమావేశంలో చర్చించారు.

గోదావరి-కావేరి నదుల అసుసంధానంలో భాగంగా గోదావరి నది నుంచి తరలించే నీటిలో తెలంగాణ రాష్ట్రానికి 66 టిఎంసిలు, ఆంధ్రప్రదేశ్‌కు 81టిఎంసిలు, తమిళనాడుకు 66 టిఎంసిలు అందించేందుకు రూపొందించిన ప్రతిపాదిత నీటి వాటాల ప్రణాళికను సమావేశంలో చర్చించారు. గోదావరి-కావేరి నదులు అనుసంధాన పథకం నిర్మాణానికి అయ్యే వ్యయం తొలుత రూ.89వేల కోట్లుగా అంచనా వేయగా, సవరించిన తాజా అంచనాల మేరకు ఈ పథకం వ్యయం రూ.1.5లక్షల కోట్లకు పెరిగిందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వివరించింది. 

నదుల అనుసంధానానికి జరిగే వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం భరిస్తుందని, మిగిలిన 40 శాతం వ్యయాన్ని భాగస్వామ్య రాష్ట్రాలు భరించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయన్ని వెల్లడిస్తూ తొలుత గోదావరి నదిలో నీటి లభ్యత, మిగులు నీటిని సమగ్రంగా అధ్యయనం చేయించాలని, నీటి లభ్యతను తేల్చాకే ముందుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

ఎపి ప్రభుత్వం తన వైఖరిని వెల్లడిస్తూ గోదావరి-కావేరి నదుల అనుసంధానాన్ని పోలవరం నుంచి ప్రారంభించాలని సూచించింది. గోదావరి నదిలో తమ రాష్ట్ర నీటి అవసరాలు పోను మిగులు జలాలను కావేరి నదికి తరలిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదిని సూత్రప్రాయంగా వెల్లడించింది. 

గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో క్షామ పీడిత ప్రాంతాలకు లబ్ధ్ది చేకూరితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదిని, అయితే ఈ పథకం ద్వారా తమ రాష్ట్రానికి జరిగే మేలేమిటని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. నదులు అనుసంధానం ప్రాజెక్టు ద్వారా అత్యధికంగా లబ్ధి చేకూరనున్న తమిళనాడు , పుదుచ్చేరి రాష్ట్రాలు రెండో ఆలోచనకు తావులేకుండా గోదావరి-కావేరి నదుల అనుసంధాన కార్యక్రమానికి తమ అంగీకారం తెలిపాయి . 

సమావేశం అనంతరం కేంద్ర జలశక్తి శాఖ అధికారులు మీడియాకు సమావేశపు వివరాలను వెల్లడించారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి భాగస్వామ్య రాష్ట్రలుగా ఉన్న అన్ని రాష్ట్రాలు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపాయని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తమ పాత విధానాలకే కట్టుబడి ఉన్నాయని తెలిపారు.

ఆయా రాష్ట్రాలు లేవనెత్తిన సందేహాలు, సమస్యలను త్వరగా ఒక కొలిక్కి తెచ్చేలా చూస్తామని పేర్కొన్నారు. కొన్ని అంశాలపై ఆయా రాష్ట్రాలతో త్వరలోనే విడివిడిగా మాట్లాడతామని తెలిపారు. వీలైనంత వేగంగా గోదావరి-కావేరి నదుల అనుసంధానం పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు గోదావరి నదిలో నీటి లభ్యతపై అధ్యయనం చేయాలని కోరాయని వివరించారు. 

అయితే ఈ సమావేశం కేవలం సూత్రప్రాయ సమావేశమే అని ఇందులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ పేర్కొన్నారు. జాతీయ నీటి అభివృద్ధ్ది సంస్థ (ఎన్‌డబ్ల్యూడిఎ) అధ్వర్యంలో ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ జలశక్తి కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి అంతర్ రాష్ట్ర నదీజలాల విభాగం అధికారులు మోహన్ కుమార్,ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ కార్యదర్శి జవహర్ రెడ్డి, ఈఎన్‌సి నారాయణరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.