పంజాబ్ సీఎం చన్నీపై కేసు నమోదు

పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి చరణ్ జిత్ సింగ్ చన్నీ, మరో కాంగ్రెస్ అభ్యర్థి శుభ్‌దీప్ సింగ్ వురపు సిద్ధూ మూసేవాలాలపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది.  వీరు శాసన సభ ఎన్నికల కోసం ప్రచార గడువు ముగిసినప్పటికీ ప్రచారం చేసినందుకు ఈ కేసు మాన్సా జిల్లాలో శుక్రవారం నమోదైంది.
ఆదివారం జరిగే ఎన్నికల కోసం ప్రచారానికి గడువు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 188 ప్రకారం వీరిపై సిటీ-1 మాన్సా పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ప్రభుత్వ అధికారి ప్రకటించిన ఆదేశాలను ఉల్లంఘించారని వీరిపై ఆరోపణలు నమోదయ్యాయి. మూసేవాలా తరపున ఇంటింటి ప్రచారం చేసేందుకు చన్నీ శుక్రవారం మాన్సాకు వచ్చారు.
మాన్సా నుంచి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ విజయ్ సింగ్లా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.  విజయ్ సింగ్లా ఫిర్యాదు మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ తనిఖీలు నిర్వహించింది. చన్నీ మాన్సాలో ఓటరు కాదని గుర్తించింది. ఆయన వేరొక నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని గమనించింది. మూసేవాలా 400 మందికి పైగా మద్దతుదారులతో ప్రచారం చేస్తున్నారని, ఇది కూడా నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొంది.
 
కాగా, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఈ నెల 20న ఒకే దశలో రాష్ట్రంలో 117 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.  ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పట్టుదలగా ఉండగా, ఇటీవల జరిగిన చంఢఘీర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. 
 
మరోవైపు మాజీ సీఎం, కాంగ్రెస్‌ మాజీ నేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌తో జట్టు కట్టిన బిజెపి కూడా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తోంది. మార్చి 10న ఫలితాలు వ్లెలడికానున్నాయి.