ఇండోర్‌లో అసియాలో అతి పెద్ద గోబర్-ధన్ ప్లాంట్‌

ఇండోర్‌లో ఉన్న ఆసియాలో అతి పెద్ద గోబర్-ధన్ (బయో-సీఎన్‌జీ) ప్లాంటును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇళ్లు, జంతువులు, సాగు భూముల నుంచి వచ్చే తడి వ్యర్థాలు ఓ విధంగా గోబర్ (ఆవు పేడ) ధనమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
 
రానున్న రెండేళ్ళలో 75 మేజర్ మునిసిపాలిటీల్లో ఇటువంటి గోబర్ ధన్ బయో సీఎన్‌జీ ప్లాంట్ల నిర్మాణానికి కృషి జరుగుతోందని ప్రధాని  చెప్పారు. మన దేశంలోని నగరాలు పరిశుభ్రంగా మారడానికి ఇవి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వీటి వల్ల నగరాలు కాలుష్య రహితం అవుతాయని, పరిశుద్ధ ఇంధనం  వస్తుందని చెప్పారు. 
 
ఈ కార్యక్రమంలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి పాల్గొన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, మునిసిపల్ ఘన వ్యర్థాల ఆధారిత గోబర్ ధన్ ప్లాంట్లను స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0లో భాగంగా నిర్మిస్తున్నారు.
 
నగరాలను చెత్త రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వీటిని నిర్మిస్తున్నారు. ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు. వేరుపరచిన సేంద్రియ తడి వ్యర్థాలను ఈ గోబర్ ధన్ ప్లాంటు శుద్ధి చేస్తుంది. 
 
దీనిలో రోజుకు 550 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేసి, దాదాపు 17,000 కేజీల సీఎన్‌జీని, 100 టన్నుల కంపోస్టును ఉత్పత్తి చేయవచ్చు. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. ఆర్గానిక్ కంపోస్టు (సేంద్రియ ఎరువు)ను ఎరువుగా అందజేయడానికి వీలవుతుంది.
 
కిసాన్ డ్రోన్ ల ప్రారంభం 
 
కాగా, 100 కిసాన్‌ డ్రోన్లను ప్రధాని నరేంద్ర మోదీ   ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో దేశంలోని పలు ప్రాంతాల్లో 100 కిసాన్ డ్రోన్లను ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించారు.వీటిని వివిధ ప్రాంతాల్లో పురుగుల మందు పిచికారీ చేయడానికి, వ్యవసాయ సామాగ్రిని తరలించేందుకు వీటిని వినియోగించనున్నారు. రైతులకు సహాయపడే లక్ష్యంతో.. పొలాల్లో పురుగుల మందు పిచికారి చేసేందుకు కిసాన్ డ్రోన్ల కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.  
రాబోయే రెండేళ్లలో గరుడ ఏరోస్పేస్ ఆధ్వర్యంలో లక్ష డ్రోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం వరకు డ్రోన్లు అనగానే రక్షణ రంగానికి చెందినవని ప్రధాని గుర్తు చేశారు. 21వ శతాబ్దంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం సరికొత్త అధ్యయనమని చెప్పారు. ఇది యువతకు ఉపాధి అవకాశాలను తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.