ప్రభుత్వ శాఖల నిధులు కైవసం… వడ్డీలు సహితం ఎగవేత!

ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేయడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వంకు చెందిన పలు సంస్థల్లో ఉన్న నిధులను పిడి ఖాతాల ద్వారా గల నిధులను సహితం  ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, తరువాత దానిపై సంస్థలకు చెల్లించాల్సిన వడ్డీలను సహితం మరిచిపోవడం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు రివాజుగా మారింది. 

చివరకు ఆ సంస్థలు తాము రుణంగా తీసుకున్న ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఇవ్వాల్సిన అసలు, వడ్డీలను చెల్లించలేక చతికిలపడడం జరుగుతోంది. తాజాగా అత్యంత కీలకమైన ఇంధన శాఖలో ఇదే పరిస్థితి నెలకొంది. 

జెన్‌కో, డిస్కామ్‌లు కేంద్ర పవర్‌ ఫైనాన్స్‌ సంస్థ, ఎపి పవర్‌ ఫైనాన్స్‌ సంస్థల నుంచి దాదాపు రూ.1,550 కోట్లు రుణంగా తీసుకున్నాయి. ఈ నగదును 2020 మార్చి, జులై, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోనే సేకరించగా, వెనువెంటనే పిడి ఖాతాల ద్వారా ఈ నగదును ఆర్థికశాఖ స్వాధీనం చేసుకుంది.

తరువాత కాలంలో పలు అవసరాలకు ఈ నిధులను నాలుగు విడతలుగా జెన్‌కో తిరిగి తీసుకుంది. అయితే ఈ నగదుకు సంబంధించిన వడ్డీని ఎపిపిఎఫ్‌సి, కేంద్ర పిఎఫ్‌సిలకు జెన్‌కో చెల్లించాల్సి ఉంది. సొమ్ము వాడుకున్నది ఆర్థికశాఖ అయితే వడ్డీ చెల్లించాల్సిన భారం మాత్రం జెన్‌కోపైనే పడుతోంది. 

ఇలా దాదాపు రూ.83 కోట్ల వరకు వడ్డీ చెల్లించాల్సి ఉన్నట్లు జెన్‌కో అధికారులు చెబుతున్నారు. ఈ నిధులను ఆర్థికశాఖ వెంటనే తమకు విడుదల చేయాలని చాలాకాలంగా జెన్‌కో అధికారులు కోరుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖకు జెన్‌కో అధికారులు లేఖ రాసినట్లు తెలిసింది.

ఇప్పటికే అప్పుల భారం కారణంగా జెన్‌కో అధికారులు అసలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉండడం, విద్యుత్‌ ఉత్పత్తికి అససరమైన బొగ్గుకు చెల్లించాల్సిన నిధులు కూడా సకాలంలో చెల్లించలేక చేతులెత్తేయడంతో రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం కూడా నెలకొంది.

తరువాత అప్పోసొప్పో చేసి ఎన్‌టిపిసికి నిధులు చెల్లించడంతో కొంతవరకు విద్యుత్‌ గండం నుంచి గట్టెక్కగలిగారు. చివరకు జెన్‌కోలో ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి కూడా ఉండడం, ఉద్యోగులు ఆందోళన దిశగా అడుగులు వేస్తుండడం తెలిసిందే.