దేశాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకం

దేశాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కొనియాడారు. బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌తో పాటు నిర్మాణం పూర్తయిన పలు జాతీయ రహదారులను ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డితో కలసి గడ్కరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ అభివృద్ధికి పోర్టులు చాల అవసరమని చెప్పారు. 
ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు ఇస్తామని, 22 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌ హైవేలు ప్లాన్ చేస్తున్నామని, అందులో 6 ఏపీలో ఉంటాయని వెల్లడించారు.   విశాఖ నుంచి రాయపూర్ 16,102 కోట్ల విలువైన రోడ్ నిర్మిస్తామని తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే 2024 లోపే పూర్తిచేస్తామని పేర్కొన్నారు. నాగ్‌పూర్-విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవేను 2025 నాటికి పూర్తిచేస్తామని, హైదరాబాదు-విశాఖ ప్రాజెక్ట్‌ 2025 నాటికి పూర్తవుతుందని గడ్కరీ వివరించారు.
 
‘‘బెంగళూరు-చెన్నై 17 వేల కోట్ల ప్రాజెక్టు ద్వారా.. ఏపీ, కర్నాటక, తమిళనాడు మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ హైవేపై గంటకు 160 కి.మీ. వేగంతో వెళ్లవచ్చు. గ్రీన్ హైడ్రోజన్ అందుబాటులోకి తెచ్చేందుకు చూస్తున్నాం. విజయవాడ తూర్పు రింగ్ రోడ్‌కు అనుమతిస్తున్నాం. 50 శాతం ల్యాండ్ పూలింగ్ ఖర్చు కేంద్రానిదే. ఏపీ సీఎం 20 ఆర్ఓబీలు అడిగారు, మేం 30 ఆర్ఓబీలకు అనుమతిస్తున్నాం’’ అని గడ్కరీ ప్రకటించారు.
 
ఏపీలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు కీలకమైనవి, వ్యవసాయ రంగంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని గడ్కరీ కితాబిచ్చారు. రైతులు, వ్యవసాయ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని ప్రశంసించారు. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయిన తర్వాత తాను వ్యక్తిగతంగా ఏపీకి వస్తానని మంత్రి తెలిపారు. 
 
తాను జలవనరుల మంత్రి కానప్పటికీ పోలవరం ప్రాజెక్టును చూస్తానని చెబుతూ  జలాలు సముద్రంలో కలవకముందే నదులను అనుసంధానించుకుందామని గడ్కరీ సూచించారు. అలాగే.. పరిశ్రమలతోనే ఉపాధి కల్పన సాధ్యమని చెప్పారు. ఇథనాల్‌ ఉత్పత్తికి ఏపీ కేంద్రం కావాలని నితిన్‌ గడ్కరీ ఆకాంక్షించారు.  దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం అవుతుందని తెలిపారు. 
 
త‍్వరలో డీజిల్‌ లారీలకు బదులుగా ఎలక్ట‍్రిక్‌ లారీలు, డీజిల్‌ స్థానంలో సిఎన్‌జీ, ఎల్‌పిజి రవాణా వాహనాలు వస్తాయని చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం తగ్గి.. గ్రీన్‌ హైడ్రోజన్‌ వాడకం పెరిగితే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని అభిలాష వ్యక్తం చేశారు. 
 
కేంద్ర సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. . విజయవాడలో ట్రాఫిక్‌ సమస్యను తొలగించడానికి బెంజ్‌ సర్కిల్‌ వద్ద మరో ఫ్లై ఓవర్‌ను గడ్కరీ సహకారంతో వేగంగా పూర్తి చేశామని సిఎం  జగన్‌ పేర్కొన్నారు.
 
 అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల్లో వేగంగా పనులు, భూసేకరణతో పాటు అన్ని అంశాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో మిగిలిన రహదారుల పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రూ.10,600 కోట్లతో మిగిలిన రోడ్లను కూడా అభివృద్ధి చేస్తున్నామని సిఎం తెలిపారు.
 
జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు. 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. విశాఖ పోర్టు నుండి భీమిలి, భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ వరకు సముద్రతీరంలో 6 లైన్ల రహదానికి ఏర్పాటు చేసి, దానిని 16వ జాతీయ రహదారికి అనుసంధానం చేయాలని సిఎం జగన్‌ కేంద్రాన్ని కోరారు. అంతేకాకుండా పలు రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సిఎం విజ్ఞప్తి చేశారు.
 
గతేడాది డిసెంబరులోనే నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వచ్చి పూర్తయిన బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌ను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఆ పర్యటన రద్దయింది. వాహనదారులకు అసౌకర్యంగా ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ ఫ్లైఓవర్‌పై వాహనాలను అనుమతిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి సమయం ఇవ్వడంతో ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు.