నిన్న ప్రవీణ్ ప్రకాష్… నేడు గౌతమ్ సవాంగ్ అవుట్!

గత రెండున్నరేళ్లుగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుగులేని అధికారులుగా వ్యవహరిస్తూ,  కీలక పాత్ర వహిస్తున్న ఇద్దరు కీలక అధికారులు ఒక రోజు వ్యవధిలో అనూహ్యంగా బదిలీ అయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా మొత్తం ప్రభుత్వ వ్యవహారాలపై ఆధిపత్యం వహిస్తూ, చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సహితం తెలియకుండా ఆదేశాలు ఇస్తూ వచ్చిన ప్రవీణ్ ప్రకాష్ ను సోమవారం ఢిల్లీలో ఆంధ్ర భవన్ రెసిడెంట్ కమీషనర్ గా బదిలీ చేశారు. 
 
ఆ పదవిలో ఉన్న ఆయనను జగన్ మోహన్ రెడ్డి అధికారమలోకి కావాలని తమ కార్యాలయంకు తీసుకు వచ్చారు. ఆయన వ్యవహారం పట్ల పలువురు సీనియర్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా పట్టించుకోలేదు. అదే విధంగా జగన్ పాలనలో డిజిపిగా బాధ్యతలు చేపట్టి, ప్రతిపక్ష నాయకులను వేధించే విషయంలో రాష్ట్ర పోలీస్ ఏకపక్షంగా వహిస్తున్నదనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ సవాంగ్ ను మంగళవారం బదిలీ చేశారు. 
 
ప్రవీణ్ ప్రకాష్ కు కేంద్ర ప్రభుత్వంలో పలువురు సీనియర్ అధికారులతో సాన్నిహిత్యం ఉన్నదనే ఆలోచనతో ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు చక్కబెట్టవచ్చని భావించిన ముఖ్యమంత్రి ఆయన వ్యవహారశైలిని భవిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఢిల్లీలో సొంతంగా పలుకుబడి పెంచుకోవడం, మరోవంక అతని పాలనా వ్యవహారాలు తనకు నమ్మకస్తులైన వారికి సహితం ఇబ్బందికరంగా మారుతూ ఉండడంతో బదిలీ చేసిన్నట్లు తెలుస్తున్నది. 
 
అయితే, గౌతమ్ సవాంగ్ బదిలీ విషయమై తెలియడం లేదు. అధికార పక్షం నుండి వస్తున్న వత్తిడులను తగ్గుకోలేక ఆయనే తప్పుకున్నారా? లేదా ఆయన తమ `రాజకీయ ప్రయోజనాలు’ కాపాడలేక పోతున్నారని జగన్ అసంతృప్తిగా ఉన్నారా? తెలియవలసి ఉంది. 
 
పైగా, ఆయనకు మరో పోస్టింగ్ ఇవ్వకుండా, జిఎడి కి రిపోర్ట్ చేయమని ఉత్తరువులలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది జులై లో ఆయన ఉద్యోగ విరమణ చేయవలసి ఉంది.  ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించారు. రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం  రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు
 
ఈ నెల ప్రారంభంలో విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు `చలో విజయవాడ’ పేరుతో జరిపిన భారీ నిరసన ప్రదర్శనను `పోలీస్ వైఫల్యం’గా భావించి ఆయనను బదిలీ చేసిన్నట్లు చెప్పుకొంటున్నారు. ఎక్కడికక్కడ ఉద్యోగులను కదలకుండా కట్టడి చేసినా, తీవ్రమైన ఆంక్షలను అమలు పరచినా భారీ సంఖ్యలో విజయవాడకు చేరుకోవడం అంటే పోలీస్ సహకారం లేకుండా సాధ్యం కాదని అధికారపక్ష నేతలు కూడా భావిస్తున్నారు. 
 
ఇటీవల కాలంలో మొత్తం రాష్ట్రంలో అంత భారీ జనసమీకరణను ఎవ్వరు జరపలేదు. చివరకు రాజకీయ పార్టీలు కూడా జరపలేదు. రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఉద్యోగులు అంత భారీ నిరసనలు జరపడం ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నదనే సంకేతం పంపుతున్నట్లు జగన్ కలవరం చెందుతున్నట్లు భావిస్తున్నారు. 
 
తమ ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం, ముఖ్యంగా అధికార పార్టీ మద్దతుదారులతో మనోనిబ్బరం నింపడం కోసమే డిజిపిపై వేటు వేసిన్నట్లు అర్ధం అవుతున్నది. అయితే ఈ బదిలీలు అధికార పక్షం ప్రయోజనాలకోసం నియమ, నిబంధనలను ఖాతరు చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ వస్తున్న ఇతర అధికారులకు సహితం ఒక హెచ్చరిక కాగలదని పరిశీలకులు భావిస్తున్నారు. 
 
అధికారంలో ఉన్నవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం నిబంధనలకు తిలోదకాలిస్తే తర్వాత తాము తగు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందనే ఆందోళనకు దారితీసే అవకాశం ఉన్నది. ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతతో అధికార పక్షం కలవరం చెందుతున్నదనే సంకేతాలు వ్యక్తమయితే అధికారులు సహితం అధికారపక్షం నేతల పట్ల తమ ధోరణులు మార్చుకొనే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. 
 
ఇలా ఉండగా, ఏపీ డీజీపీని బదిలీ చేసిన కొద్ది నిమిషాల్లోనే  కడప జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ వరుణారెడ్డిని ఒంగోలు జైలు సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. ఒంగోలు జైలర్‌ ప్రకాశ్‌ను కడప జైలు సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం కడప జైలులో ఉన్న  వై ఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితులను హత్య కావించే కుట్ర జైలర్ ద్వారా జరుగుతున్నదని  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  ఇటీవల చేసిన ఆరోపణల నేపథ్యంలో వరుణారెడ్డి బదిలీ జరగడం గమన్హారం.