నేటి నుండే `తెలంగాణ కుంభమేళా’ మేడారం జాతర!

`తెలంగాణ కుంభమేళా’గా భావించే ములుగు జిల్లా మేడారం మహాజాతర నేడే ప్రారంభం కానున్నది. ఈనెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే వనదేవతల జాతర నేపథ్యంలో గత కొన్ని  రోజులుగా మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లులకు చీర, సారె, ఇచ్చి పసుపు కుంకాలు పెట్టి భక్తులు అమ్మవార్లకు పెద్ద ఎత్తున బంగారం సమర్పించుకుంటున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పండుగ ఏది అంటే ముందుగా వినిపించే పేరు మేడారం జాతర. ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. దేశంలో కుంభమేళ తర్వాత అంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. పూర్వపు వరంగల్ జిల్లా.. ప్రస్తుతం మలుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగే ఈ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. తొలినాళ్లలో ఈ జాతరను ప్రధానంగా గిరిజనులు జరుపుకునేవారు.. రాను రాను అమ్మవార్ల మహిమలు తెలిసి అందరూ కొలిచి, మొక్కుతున్నారు.

జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు యాభై లక్షలకుపైగా భక్తులు అమ్మలను దర్శించుకున్నారు. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్న వాగు కళకళలాడుతోంది. భక్తులంతా సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. చాలా మంది తాము మొక్కుకున్నట్లుగా నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. దేవతలను అడవి మార్గంలో తీసుకొచ్చే సందర్భంలో ఉద్వేగభరిత దృశ్యాలు ప్రజలను అబ్బురపరుస్తాయి.

మేడారం జాతర వేళ ములుగు సమీపంలోని గట్టమ్మ ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం వచ్చే భక్తులంతా తొలుత ఇక్కడే ఆగి గట్టమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేస్తారు. ఇక్కడ పూజలు చేసిన తర్వాతే మేడారం జాతరకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. 

ఇక్కడ తల్లిని దర్శించుకుంటే జాతర ప్రయాణం సురక్షితంగా జరుగుతుందన్నది భక్తుల విశ్వాసం. అందుకే గట్టమ్మ ఆలయాన్ని గేట్ వే ఆఫ్ మేడారంగా పిలుస్తారు. మేడారం సమ్మక్కసారలమ్మ మహా జాతరకు మహబూబాబాద్ జిల్లా గంగారం మండ లం పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్ద రాజు మంగళవారం గిరిజన ఆచార వ్యవహారల నడుమ బయలుదేరారు. 

కాగా గిరిజన సంప్రదాయం ప్రకారంగా డోలు వాయిద్యాల మధ్య పెనుక వంశీయుల ఆధ్వర్యంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆయన బయలు దేరుతారు. ఈ సందర్భంగా పూనుగొండ్ల గ్రామంలో ఉన్న పగడిద్దరాజు దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఆలయాన్ని భక్తులు నీటితో శుభ్రం చేసి జాతర ప్రయాణానికి సిద్ధం చేశారు. 

మహిళా భక్తుల పూనకాలు, శిగారాలతో ఆలయ ప్రాంగణమంతా నిండిపోయింది. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో పగిడిద్దరాజును పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి దేవుని గుట్ట మీదుగా కాలి నడకన 85 కిలోమీటర్లు ప్రయాణించి జాతరకు చేరుకుంటారని పెనుక వంశీయులు బుచ్చిరాములు, పురుషోత్తం, సురేందర్, రాజేశ్వర్ తెలిపారు.

 రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బేగంపేటలోని పాత ఎయిర్‌పోర్ట్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం జాతర సందర్భంగా హైదరాబాద్ నుంచి మేడారంకు వెళ్లే హెలికాప్టర్ సర్వీసును మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు.