కేసీఆర్ పై అస్సాంలో పోలీస్ కేసు!

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుపై అసోం పోలీసులు  కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. పలువురు బిజెపి మద్దతుదారుల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసు పెడతామని చెబుతున్నారు. సర్జికల్ స్ట్రైక్‌కు ఆధారాలు కావాలంటూ భారత సైన్యమును ప్రశ్నించినందుకు, భారత వ్యతిరేక భావాలను ప్రోత్సహించినందుకు తెలంగాణ సీఎంపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అస్సాం పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కేవలం అస్సాం చుట్టే తిరుగుతున్నాయి. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ఇటీవల కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మొదటగా, తీవ్రంగా  స్పందించారు. రాహుల్ గాంధీపై అసోం సీఎం చేసిన వ్యాఖ్యలు దారుణమని విమర్శించారు. 

అలాంటి వ్యాఖ్యల్ని ఖండించాలని చెబుతూ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ఆధారాలు కేంద్రం బయటపెట్టాలని రాహుల్​ గాంధీ డిమాండ్​ చేయటంలో తప్పేమీ లేదని కేసీఆర్​ స్పష్టం చేశారు. తాను కూడా ఇప్పుడు వాటి ఆధారాలు అడుగుతున్నానని తెలిపారు.

అస్సాం సీఎంపై హైదరాబాద్‌లో కేసు

మరోవంక, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ‌పై హైదరాబాద్  నగరంలో కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. అస్సాం సీఎంపై మూడు సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.