కాంగ్రెస్ లో దిద్దుబాటు కలలు కల్లలయ్యాయి…

కాంగ్రెస్ అంతర్గత ప్రక్రియలు నేతలను క్షీణింపజేశాయని, ఇవన్నీ కలిసి పార్టీని బలహీనపరచాయని చెబుతూ పార్టీ దిద్దుబాటు చర్యలపై కలలు కల్లలయ్యాయని ఆ పార్టీకి మంగళవారం రాజీనామా చేసిన మరో సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశ్వని కుమార్ విచారం వ్యక్తం చేశారు. పంజాబ్‌లో పరిస్థితిని చూసినపుడు ప్రగతిశీల మార్పు చెందే పార్టీగా కాంగ్రెస్ తన పగ్గాలను కోల్పోయిందనే నమ్మకం తనకు మరింత పెరిగిందని ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  తెలిపారు. 
జాతీయ ఆకాంక్షలను వినిపించే గళంగా కాంగ్రెస్ వ్యవహరించలేకపోతోందని అనడానికి కారణాలను వివరిస్తూ, ఓట్ల శాతంలో క్షీణత నిరంతరం కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రజల మద్దతు స్పష్టంగా తగ్గిపోతోందని చెప్పారు. దీనినిబట్టి ఆ పార్టీ దేశం ఆలోచనలకు అనుగుణంగా లేదని చెప్పవచ్చునని స్పష్టం చేశారు.
 దేశ మనోభావాలను గుర్తించడం, అవసరమైనపుడు దానిని మార్చడం రాజకీయ పార్టీ చేయవలసిన పని అని పేర్కొంటూ  కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేయడం లేదనే విషయాన్ని ఎవరైనా నిరాకరించగలరా? అని ప్రశ్నించారు.  జాతీయ మనోభావాల గురించి వివరిస్తూ, కాంగ్రెస్ పార్టీ భావి నాయకత్వం విషయంలో ఆ పార్టీ చూపుతున్న ప్రత్యామ్నాయానికి జాతీయ మనోభావాలు అనుగుణంగా లేవని చెప్పారు.
కాంగ్రెస్ చూపుతున్న ఆ ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీయేనా? అని అడిగినపుడు తాను పేరు చెప్పబోనని అశ్వని కుమార్ చెప్పారు. కాంగ్రెస్ ఎక్కడ తప్పు చేసిందనే ప్రశ్నకు బదులిస్తూ, దీనికి చాలా సమాధానాలు ఉన్నాయని, అయితే ఆ పార్టీ ప్రజలతో అనుబంధాన్ని కోల్పోయిందని స్పష్టం చేశారు. చాలా కొద్ది మంది నేతలను మినహాయిస్తే, పార్టీలో జడత్వం, నిశ్చేష్టత అలముకున్నాయని చెప్పారు. పేర్కొన్నారు. 
 
కాంగ్రెస్ సిద్ధాంతాల్లో లోపం లేదని, అయితే తాను ఆ పార్టీకి సలహాలు ఇవ్వాలని అనుకోవడం లేదని చెప్పారు.  ప్రస్తుతం సమష్టి నాయకత్వాన్ని తీసుకురావడం తప్పనిసరి అని చెప్పారు. సీనియారిటీకి, ప్రతిభకు సముచిత గౌరవం ఇవ్వాలని, పెద్దల గౌరవ, మర్యాదలను భంగపరచకూడదని అంటూ పరోక్షంగా రాహుల్ గాంధీ బృందంపై ధ్వజమెత్తారు. 
 
పరివర్తన తేగలిగే నాయకత్వాన్ని కాంగ్రెస్ దేశానికి ఇవ్వలేకపోతోందని అశ్వని కుమార్  ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్ల తనకు వ్యక్తిగతంగా గౌరవం ఉన్నప్పటికీ, తన జీవితంలో మిగిలిన కాలాన్ని ప్రజా సేవ కోసం వినియోగించాలా? అన్నిటినీ విరమించుకుని ఇంట్లో కూర్చోవాలా? అనే ప్రశ్న వచ్చిందని, తాను మొదటిదానినే ఎంచుకోవాలనుకున్నానని స్పష్టం చేశారు. 
 
ఎంతో ఆలోచించి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇది చాలా బాధాకరమైన నిర్ణయమని, అయితే విధేయత, దేశం, నేను, నేతలు, స్నేహితుల మధ్య ఒకదానిని ఎంచుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ ముఖ్యమైన సమయంలో కాంగ్రెస్ చట్రంలో ఉంటూ పని చేయడం వల్ల దేశంలో ఉన్నత స్థాయి రాజకీయ వ్యవహారాలకు, ప్రజలకు ప్రయోజనకరమైన సేవ చేయడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు.