హిందువుల ఓట్లు చీల్చడానికే తృణమూల్ పోటీ

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో హిందువుల ఓట్లను చీల్చడానికే తృణమూల్​ కాంగ్రెస్​ అక్కడ పోటీ చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ  ఆరోపించారు. ఆ పార్టీ నేతలే ఈ విషయాన్ని బహిరంగం​గా చెప్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్​లో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొంటూ  హిందువుల ఓట్లను చీల్చడం కోసమే తృణమూల్​ ప్రయత్నిస్తోందని, ఆ విషయాన్ని ఆ  పార్టీ నేత ​మహువా మోయిత్రా మీడియాతో చెప్పారని ఆరోపించారు. 

ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మోయిత్రా ఈ కామెంట్స్ చేశారని తెలిపారు.  గోవాలో మహారాష్ట్రవాదీ గోమంత్రక్​ పార్టీ (ఎంజీపీ)తో కలిసి పోటీ చేయడానికి ముఖ్య కారణం ఇదేనని ఆయన విమర్శించారు. ‘హిందూ ఓట్లను చీల్చడమే సెక్యులరిజమా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఓట్లు చీల్చాలన్న ప్రయత్నం సరే, మరి మీరు ఎవరిని ఓట్లడగబోతున్నారు?’ అని టీఎంసీని ప్రధాని ప్రశ్నించారు. 

ఇలాంటి వివక్షను చూపించే నాయకులను, పార్టీలను బొంద పెట్టాలని చెబుతూ ఇప్పుడు గోవా ప్రజలకు ఆ అవకాశం వచ్చిందని మోదీ  చెప్పారు. యూపీలో గుండాలు, క్రిమినల్స్, అల్లరి మూకల గుండెల్లో యోగి ప్రభుత్వం భయాన్ని నింపిందని ప్రధాని మెచ్చుకున్నారు.

యూపీలోని బీజేపీ పాలనలో ముస్లీం అమ్మాయిలంతా  సురక్షితంగా ఉన్నారని చెబుతూ  ఇప్పుడు చాలామంది ముస్లీం బాలికలు, అమ్మాయిలు.. ఇప్పుడు స్కూల్స్, కాలజీలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై మాట్లాడుతూ.. ముస్లీం బాలికలు బయటకు వెళ్లేటప్పుడు ఈవ్ టీజింగ్ సమస్యలు చవి చూసేవారని, కానీ ప్రభుత్వం ఇప్పుడు క్రిమినల్స్ అందర్నీ అరెస్ట్ చేసిందని తెలిపారు.

 ట్రిపుల్​ తలాఖ్​కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టంతో రాష్ట్రంలోని వేలాది మంది ముస్లిం మహిళలకు భరోసా లభించిందని పేర్కొన్నారు.

మరోవైపు యూపీలో ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాదీపై కూడా విమర్శలు గుప్పించారు ప్రధాని. ఎస్పీ ప్రతీ సారి తాము పొత్తు పెట్టుకొనే పార్టీలను మారుస్తూ ఉందని చెబుతూ  ఈ విధంగా పొత్తు పార్టీలను మారుస్తుంటే.. వాళ్లు ప్రజలకు ఇంకేమి సేవ చేస్తారని ప్రశ్నించారు. 

 ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం జరుగుతున్న 2022 ఎన్నికల కోసం… పలు పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ అకాలీదళ్, చిన్న పార్టీలతో అఖిలేశ్ యాదవ్‌కు పొత్తు ఏర్పడింది. ఇక 2017 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల కోసం మాయావతి బహుజన్ సమాజ్‌ వాదీ పార్టీతో పొత్తు కొనసాగింది. 

2014లో రాహుల్ కోసం నన్ను ఆపారు 

ఇలా ఉండగా, ప్రధాని పర్యటన సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి చిన్నూ విమానాన్ని భద్రతా దళాలు అనుమతిపలేదని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తొప్పికొట్టారు. 2014 సాధారణ ఎన్నికల ​ ప్రచారంలో భాగంగా పంజాబ్​కు వచ్చిన తనను అప్పటి కాంగ్రెస్​ సర్కారు ఆపేసిందని ప్రధాని  చెప్పారు.

అమృత్​సర్​లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హిమాచల్​ ప్రదేశ్​కు బయలుదేరుతున్న తనను ఆపారని తెలిపారు. వాళ్ల యువరాజు (రాహుల్​ గాంధీ) కూడా అమృత్​సర్​లోనే ఉన్నాడని, ఆయన కోసం తన హెలీక్యాప్టర్​ను అడ్డుకున్నారని ప్రధాని  తెలిపారు.

అంతకు ముందు, హోషియార్​పూర్​లో సోమవారం కాంగ్రెస్​ ప్రచారానికి రాహుల్​ హాజరైండు. సీఎం చన్నీ కూడా వెళ్లాల్సి ఉంది. ప్రధాని టూర్​ కారణంగా సీఎం హెలీక్యాప్టర్​కు అధికారులు అనుమతించలేదు. ప్రధాని టూర్​ పేరుతో తన ప్రయాణాన్ని అధికారులు అడ్డుకున్నరని చన్నీ విమర్శించారు.