ఆందోళన కలిగిస్తున్న టోకు ధరల ద్రవ్యోల్బణం

ఆర్థిక వ్యవస్థపై ధరల పెరుగుదల భారం తగ్గుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ భరోసా ఇచ్చిన రెండు రోజులకే వెలువడిన టోకు ధరల ద్రవ్యోల్భణం సూచి ఆందోళన కలిగిస్తున్నది. ద్రవ్యోల్బణం కట్టడి–ఎకానమీ పురోగతి లక్ష్యంగా సెంట్రల్‌ బ్యాంక్‌ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం జనవరిలో 6.01 శాతం కాగా టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రెండంకెలపైన 12.96 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి ధరల స్పీడ్‌) నమోదయ్యింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 6–2 శ్రేణిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఈ స్థాయిని దాటి జనవరి గణాంకాలు నమోదు కావడం గమనార్హం.

అయితే ఈ అంచనాలు అన్నీ చివరకు క్రూడ్‌ ధరలు, సంబంధిత ప్రతికూల అంశాలపై ఆధారపడి ఉంటాయని గవర్నర్ పేర్కొనడం గమనార్హం. 

 ‘‘మా ద్రవ్యోల్బణం అంచనాలు చాలా పటిష్టంగా ఉన్నాయని నేను ఇప్పటికీ చెబుతాను. మేము దానికి కట్టుబడి ఉన్నాము. పూర్తిగా ఊహించనిది ఏదైనా జరిగితే పరిస్థితి భిన్నంగా ఉంటుందని మీకూ తెలుసు. ఇది ఎవ్వరూ ముందుగా ఊహించిలేని ఆకస్మిక స్థితి. ప్రస్తుతం ప్రతికూలాంశం ముడిచమురు ధరలే అని మీకు తెలుసు’’ అని గవర్నర్‌ తెలిపారు.

ధరల స్థిరత్వం అంటే ప్రాథమికంగా ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కొనసాగించడమేనని ఆయన పేర్కొన్నారు. దీనికి కట్టుబడి ఉండాలన్నదే తమ సంకల్పని తెలిపారు. వృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ద్రవ్యోల్బణం పట్ల తన  నిబద్ధత ఎలా ఉండాలన్నది రిజర్వ్‌ బ్యాంక్‌కు పూర్తిగా తెలుసునని దాస్‌ స్పష్టం చేశారు.

‘‘ద్రవ్యోల్బణం ధోరణిని పరిశీలిస్తే, 2020 అక్టోబర్‌ నుంచి 2021 అక్టోబర్‌ వరకూ ఈ రేటు దిగువముఖంగానే పయనించింది. అయితే మూడవ త్రైమాసికంలో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌) ఇది తీవ్రంగా కనబడుతోంది. దీనికి లోబేస్‌ ఎఫెక్ట్‌ కారణం. రానున్న నెలల్లో కూడా ఈ లోబేస్‌ ఎఫెక్ట్‌ గణాంకాలపై విభిన్న రీతుల్లో కనబడుతుంది‘‘ అని గవర్నర్‌ వివరించారు.

జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆర్‌బీఐ రెపో రేటు నిర్ణయానికి (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం. దాదాపు 18 నెలల నుంచి ఇది ఇదే స్థాయిలో కొనసాగుతోంది) ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ (సీపీఐ) ద్రవ్యోల్బణం జనవరిలో ఏకంగా 6.01 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయ్యింది. 

ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శాతం శ్రేణి ఎగువ పరిమితికన్నా ఇది ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. గడచిన ఏడు నెలల్లో ఈ స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం (2021 జూన్‌లో 6.26 శాతం) నమోదుకావడం ఇదే తొలిసారి. 

2021 జనవరిలో 4.06 శాతం. రిటైల్‌ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్‌బీఐ ఈ నెల మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. 

ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం  ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ మెజారిటీ (6:5) అభిప్రాయపడింది.  

వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 డిసెంబర్‌లో 13.56 శాతం ఉంటే, 2022 జనవరిలో 12.96 శాతానికి తగ్గింది (2021 జనవరి నెల టోకు ధరలతో పోల్చి). టోకు ద్రవ్యోల్బణం రెండంకెల పైన కొనసాగుతుండడం ఒక ఆందోళనకరమైన అంశం.

కాగా, ఆహార ఉత్పత్తుల ధరలు తీవ్ర స్థాయిలోనే కొనసాగుతుండడం గమనించదగిన మరో ప్రతికూల అంశం. గడచిన పది నెలల నుంచీ అంటే 2021 ఏప్రిల్‌ నుంచి టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగుతోంది. 2021 జనవరిలో ఈ రేటు 2.51 శాతం. అప్పటిలో బేస్‌ తాజా ధరలు తీవ్ర స్థాయిలో కనబడ్డానికి కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి.