ఘనంగా ముగిసిన సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు

ముచ్చింతల్‌లో రామానుజ చార్యుల సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు ఘనంగా ముగిశాయి. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు సోమవారం ముగియటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. 

వేడుకల్లో చివరిరోజైన సోమవారం స్వర్ణ రామానుజాచార్యుల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట నిర్వహణతో పాటూ, శ్రీ లక్ష్మీనారాయణ యజ్ఞ మహాపూర్ణాహుతీ కార్యక్రమాలు ప్రముఖ ఘట్టాలుగా నిలిచాయి. చినజీయర్ స్వామి తమ శిష్యగణంతో పాటూ, వందలమంది ఋత్వికులూ, వేల సం ఖ్యలో భక్తులూ హాజరైన పక్షంలో పవిత్రమైన ఆ శ్రీలక్ష్మీనారాయణ మహాయాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు.

కార్యక్రమాలలో భాగంగా, సోమవారం ఉదయం యాగశాలలోని సహస్ర హోమకుండాలలో శ్రీలక్ష్మీనారాయణ యజ్ఞం జరిపించి, తదనంతరం చినజీయర్ స్వామి ఆథ్వర్యంలో య జ్ఞానికి మహా పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా నిర్వహించారు. యా గంలో వినియోగించిన 1035 పాలికులను తీసుకుని, సమతామూర్తి సువర్ణ ప్రతిమ వద్దకు భక్తజనంతో యాత్రాగా బయలుదేరి వైభవంగా సువర్ణ సమతా మూర్తికి ప్రాణ ప్రతిష్ఠాపన చేశారు.

తొలి ఆరాధనతో పాటూ, పారాగ్లైడర్లతో పుష్పాక్షతల అభిషేకాన్నీ, పంచామృతాలతో, తదనంతరం ఉదకంతో అభిషేకాన్ని, అరుదైన పుష్పాలతో అర్చనా నిర్వహించారు. ప్రతిష్ఠాపనా కార్యక్రమం తరువాత భద్రవేది మొదటి అంతస్థులో ఉన్న ఋత్వికులూ, భక్తులూ కలిసి పవిత్రమైన శ్రీమన్నారాయణ తిరుమంత్రాన్ని ఆలపిస్తూ ఆనందతాండవం చేశారు. 

చినజీయర్ స్వామి తన బృందంతో కలిసి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు 108 దివ్య దేశపు ఆలయాల్లో దేవతామూర్తులకు కళ్యాణోత్సవాలు నిర్వహించారు. పదమూడో రోజైన సోమవారం నుంచి సాధారణ భక్తు జనులందరికీ నిత్యం శ్రీరామానుజుల ఆలయ దర్శనానికి అనుమతించారు. ఎనిమిదో వింతగా కీర్తి గాంచిన ఈ పుణ్య క్షేత్రంలో సమతా మూర్తికీ, దివ్యదేశాలలో పెరుమాళ్ళకీ నిత్యం విశేష పూజలు నిర్వహిస్తారు.

యాగశాలకు నలుదిక్కుల యజ్ఞగుండాల దగ్గరున్న ద్వారపాలకుల అనుమతి తీసుకుని మహాపూర్ణాహుతి నిర్వహించారు. మహాపూర్ణాహుతితో 12 రోజుల యజ్ఞం విజయవంతమైంది. ఈనెల 3న మొదలైన శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు 12 రోజులపాటు నిర్విఘ్నంగా కొనసాగింది.  12 రోజుల పాటు వివిధ హోమాల్లో 5 వేల మంది రుత్వికులు పాల్గొన్నారు.

ప్రతిరోజు అష్టాక్షరీ మంత్ర పఠనం, విష్ణుసహస్ర పారాయణం నిర్వహించారు. యజ్ఞంలోఓ భాగంగా విశ్వక్సేనేష్టి, నారసింహ ఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి, పరమేష్టి, వైభవేష్టి, హయగ్రీవ ఇష్టి, వైయ్యూహిక ఇష్టి, సుదర్శన ఇష్టి, వైనతే ఇష్టి పూజలను చేశారు. ప్రతిరోజు 114 యాగశాలలో 1035 హోమకుండాల్లో 5 వేల మంది రుత్విజులు భక్తి శ్రద్ధలతో హోమం నిర్వహించారు.

అయితే సోమవారం రాత్రి  108  దివ్యదేశాల్లోని ఆలయాల్లో జరుగాల్సిన శాంతి కళ్యాణం వాయిదా వేశామని చిన్న జీయర్ స్వామి తెలిపారు. ఈ నెల 19 న 108 ఆలయాల్లో శాంతి కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు. యాగశాలలో హోమాలు నిర్వహించిన రుత్వికులను చిన్న జీయర్ స్వామి ఈ సందర్భంగా సన్మానించారు. 

ప్రవచన మండపంలో రుత్వికులు, భక్తులతో  చిన్నజీయర్ స్వామి సమావేశమయ్యారు. చరిత్రలో 108 ఆలయాల్లో మొదటి సారి ఈ నెల 19 వ తేదీన  కళ్యాణం నిర్వహిస్తామని చెప్పారు.  వైభవంగా శాంతి కళ్యాణం జరపాలని నిర్ణయించామని పేర్కొన్నారు. యాగశాలలో జరిగిన శ్రీలక్ష్మీనారాయణ యజ్ఞం మహాపూర్ణాహుతికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు