కాంగ్రెస్ తో పొత్తు కోసం కేసీఆర్ తహతహ

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమ తప్పదని గ్రహించే ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ తో పొత్తుకు తహతహలాడుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు బలపడుతోందని, అది తట్టుకోలేక కేసీఆర్ బీజేపిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 

అధికారాన్ని నిలబెట్టకోవడం కోసమే కేసీఆర్ రాహుల్ గాంధీపై సానుభూతి చూపించారని ఆమె విమర్శించారు. రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి వాఖ్యల విషయంలో కాంగ్రెస్ నేతల కంటే ముందే కేసీఆర్ స్పందించి సానుభూతి ప్రకటించటం చూస్తే  రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని అర్థమవుతోందని ఆమె చెప్పారు. 

ఇలా రాహుల్ గాంధీపై అకస్మాత్తుగా ప్రేమ రావడం అధికారదాహమే తప్ప మరొకటి కాదని ఆమె ధ్వజమెత్తారు.  భైంసాలో హిందువులపై దాడులు జరిగితే మాట్లాడని కేసీఆర్… మతరాజకీయాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఆమె పేర్కొన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ హిందువులను కించపరిచేలా మాట్లాడినప్పుడ కేసీఆర్  కళ్లల్లో నీళ్లెందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు.

ప్రధానమంత్రి మోదీపై  సోనియా గాంధీ, చంద్రబాబు, ఇతర ప్రతిపక్షాల నాయకులు కామెంట్స్ చేసినప్పుడు కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ఆమె నిలదీశారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని విజయశాంతి స్పష్టం చేశారు.