పురావస్తుశాలలపై నేటి నుండి ప్రపంచ స్థాయి సదస్సు 

పురావస్తుశాలలను సరికొత్త హంగులతో.. మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే క్రమంలో ‘రీఇమాజినింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా’ పేరుతో కేంద్ర సాంస్కృతిక శాఖ హైదరాబాద్‌లో రెండ్రోజుల పాటు ప్రపంచస్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం  ప్రారంభిస్తున్నారు.
వర్చువల్ విధానంలో సాగే ఈ సమావేశంలో భారత్, అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్‌, ఫ్రాన్స్, ఇటలీ, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలకు చెందిన పురావస్తు రంగ నిపుణులు పాల్గొననున్నారు. ఆసక్తిగల ప్రజలు కూడా ఇందులో పాల్గొనవచ్చు. ఇప్పటికే 2300 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అద్భుతమైన చరిత్రను స్మరించుకుంటూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
పురావస్తుశాల (మ్యూజియం) అభివృద్ధి, నిర్వహణ రంగంలో ఉత్తమ పద్ధతులు, ప్రణాళికల గురించి చర్చించడానికి వీలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ రంగంలోని ప్రముఖులు, నిపుణులు, అభ్యాసకులను ఈ సమావేశం ఒకే వేదిక మీదకు తీసుకొస్తోంది. 25 మందికి పైగా మ్యూజియాలజిస్టులు, మ్యూజియం నిపుణులు, మ్యూజియాల పునరుద్దరణకు సంబంధించిన ప్రాధాన్యతలను, అభ్యాసాలను పరిశీలిస్తారు.
ఈ విధంగా పంచుకున్న విజ్ఞానం ద్వారా కొత్త మ్యూజియంల అభివృద్ధికి సంబంధించిన నమూనాను రూపొందించడం, పునరుద్ధరణకు సంబంధించిన విధానాలను అభివృద్ధి చేయడం, అలాగే దేశంలో ఇప్పటికే ఉన్న మ్యూజియంలను పునరుద్ధరించడం చేయనున్నారు.
ఈ సమావేశం గురించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశం మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుండి గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన భూమి అని, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ను జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో, మన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, శాశ్వతంగా కొనసాగించడం పట్ల కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
భారతదేశంలోని 1000 కి పైగా పురావస్తుశాలలు ఈ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంలో, సంరక్షించడంలో మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
గత 7 సంవత్సరాలుగా డిజిటల్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, ఆకర్షణీయమైన ప్రదర్శనలు, సమాచారంతో కొత్త మ్యూజియంలను నిర్మించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
ఇప్పటికే ఉన్న మ్యూజియంలను కొత్త తరానికి అనువుగా అభివృద్ధి చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందని చెప్పారు.