స్వామి వివేకానంద బోధనల్లో ఆచరణాత్మకత ఎక్కువ

స్వామి వివేకానంద బోధనల్లో ఆచరణాత్మకత ఎక్కువని తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి డాక్టర్ రాధారాణి చెప్పారు. 1893 ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీలో స్వామి వివేకానంద ప్రసంగించిన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద బోధనలతో రూపొందించిన మై కాల్ టు ద నేషన్ పుస్తకంలోని పలు అంశాలపై  ప్రసంగించారు. 
 
చిన్న పుస్తకంలోనే ఎన్నో విలువైన విషయాలున్నాయ ని చెబుతూ స్వామి వివేకానంద చికాగో వెళ్లే ముందు భాగ్య నగరంలో పర్యటించడం గొప్ప విషయమని రాధారాణి తెలిపారు.  ఇతర మతాల పట్ల సహనంతో ఉండడంలోనే హిందూ మత ఔన్నత్యం దాగి ఉందని పేర్కొంటూ ఈ విషయాన్నే స్వామి వివేకానంద ప్రభోదించారని చెప్పారు. ఆయన బోధనలు ప్రస్తుతం స్మరించుకోవాలని కోరారు. 
భగవంతుడిని ఆరాధించడంకన్నా సత్య శోధన ద్వారా ఆత్మబలాన్ని పెంపొందించుకోవడమే మిన్న అని స్వామీజీ చెప్పిన మాటలను ఉటంకించారు. వివేకానంద బోధనల్లోని స్ఫూర్తిదాయక విషయాలను ప్రస్తావిస్తూ.. వాటిని యువతలోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింప చేసేందుకు వివేకానంద బోధించిన మానవతా దృక్పథాన్ని ఆశ్రయించడమే యువతరం ముందున్న కర్తవ్యమని  ఆమె పిలుపునిచ్చారు.
శివానంద ఆశ్రమానికి చెందిన స్వామి తత్వవిధానంద మాట్లాడుతూ  వివేకానందను హీరో ఆఫ్‌ యూనిటీగా అభివర్ణించారు. స్వామీజీ బోధనలను హైందవ మతంలోని చాలామంది నేటికీ సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద మాట్లాడుతూ స్వామి వివేకానంద భాగ్యనగర పర్యటన విషయాలను వివరించారు. ఫిబ్రవరి 13ను తెలంగాణ ప్రభుత్వం వివేకానంద డే గా గుర్తించాలని కోరారు. 
 
సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్ స్వామి వివేకానంద బోధనల్లో ఏడు అంశాలపై వివరిస్తూ గురుభక్తి, దైవభక్తి, మాతృభక్తి, సేవ, మహిళలపట్ల దైవీ భావన తదితర అంశాలు నేటికి మన సమాజంకు  మార్గదర్శకాలని చెప్పారు.  కార్యక్రమంలో మెహబూబ్ కాలేజీ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి నరేశ్ కుమార్ యాదవ్, రామకృష్ణ మఠం వాలంటీర్లు, భక్తులు పాల్గొన్నారు.