పంజాబ్‌లో రానున్నది ఎన్డీయే, యుపిలో బిజెపి ప్రభుత్వమే

పంజాబ్‌లో ఎన్‌డీయే ప్రభుత్వం రాబోతోందని, ఉత్తర ప్రదేశ్ లో తిరిగి బిజెపి ప్రభుత్వం మళ్ళి మంచి ఊపుతో రాబోతున్నదని   ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. ఆయన సోమవారం పలు శాసన సభ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, తాము సమాఖ్య వ్యవస్థను గౌరవిస్తున్నామని చెప్పారు. 
 
మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సమాఖ్య విధానం ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేశారని జలంధర్ లో జరిగిన బహిరంగసభలో చెబుతూ  రుణాల నుంచి నవ పంజాబ్ విముక్తి అవుతుందని తెలిపారు.  రైతుల కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. 23 లక్షల మంది పంజాబ్ రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి క్రింద లబ్ధి పొందుతున్నారని చెప్పారు.
 అర్హులైన రైతుల ఖాతాలకు సంవత్సరానికి రూ.6,000 చేరుతోందని చెప్పారు. ఎరువులు, పురుగు మందులను అంతర్జాతీయ మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరలకు అందజేస్తున్నామని తెలిపారు. సహజసిద్ధ, ప్రకృతి వ్యవసాయంపై కృషి చేస్తామని తెలిపారు.  1984లో సిక్కులపై జరిగిన దాడులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, కాంగ్రెస్ మాత్రం ఈ దాడుల్లో నిందితులకు ఉన్నత స్థాయి పదవులను ఇచ్చిందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ మన సైన్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ప్రధాని మండిపడ్డారు. ఎన్నికల ప్రచార సభ ముగిసిన తర్వాత తాను త్రిపురమాలిని దేవి శక్తి పీఠాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేయాలనుకున్నానని, అయితే తాము ఏర్పాట్లు చేయలేమని పంజాబ్ పరిపాలనా యంత్రాంగం, పోలీసులు తనకు చెప్పారని విస్మయం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో భద్రత పరిస్థితులు ఇంత దయనీయంగా ఉన్నాయని పేర్కొంటూ  తాను త్వరలోనే త్రిపురమాలిని దేవికి ప్రత్యేక పూజలు చేస్తానని స్పష్టం చేశారు.
కాగా, ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహా ఊపుతో రాబోతోందని తొలి విడత పోలింగ్, రెండో విడత ఓటింగ్ సరళిని బట్టి స్పష్టమవుతోందని  మోదీ చెప్పారు. కాన్పూరులో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, రాష్ట్ర సత్వర అభివృద్ధి కోసం ప్రతి కులం, వర్గం సమైక్యంగా ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు. తనను దీవించేందుకు ముస్లిం సోదరీమణులు నెమ్మదిగా ఇళ్ళ నుంచి బయల్దేరుతున్నారని చెప్పారు. 
ఎలాంటి విభజన, అయోమయం లేకుండా ప్రతి కులం, ప్రతి వర్గం ప్రజలు ఉత్తర ప్రదేశ్ సత్వర అభివృద్ధి కోసం ఓటు వేస్తున్నారన్నారు. బీజేపీ జయకేతనాన్ని మన తల్లులు, సోదరీమణులు, ఆడ బిడ్డలు తమంతట తామే ఎగురవేస్తున్నారని తెలిపారు. ‘‘నా ముస్లిం సోదరీమణులు మోదీని ఆశీర్వదించాలని మానసికంగా సిద్ధమై, ఎలాంటి చప్పుడు లేకుండా, నెమ్మదిగా ఇంటి నుంచి బయల్దేరుతున్నారు’’ అని చెప్పారు.
 
మాఫియా తిరిగి పుంజుకోవడం కోసం సమాజ్‌వాదీ పార్టీకి, అఖిలేశ్ యాదవ్‌కు మద్దతిస్తోందని ప్రధాని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లో వంశపారంపర్యంగా కుటుంబ పాలన జరిగినపుడు రేషన్ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. 
 
పేదలకు ఆహార ధాన్యాలు దక్కలేదని, లక్షలాది నకిలీ రేషన్ కార్డులను సృష్టించారని విమర్శించారు. డబుల్ ఇంజిన్ (మోదీ, యోగి) ప్రభుత్వం ఈ నకిలీ రేషన్ కార్డు స్కీమ్‌కు తెర దించిందని కొనియాడారు. నేడు కోట్లాది మంది ఉత్తర ప్రదేశ్ ప్రజలు ఉచితంగా రేషన్ సరుకులను పొందుతున్నారని చెప్పారు.