
అయితే ఈ పరిణామం అనంతరం డీజీపీ ద్వారా తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 3న సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయించింది. దీనిపై సోమవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మధురై బెంచ్ తీర్పును సమర్థిస్తూ తమిళనాడు డీజీపీకి, ప్రభుత్వానికి నోటీసులు పంపింది.
సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) దర్యాప్తు కోసం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకించడం ద్వారా ఈ కేసును పరువు, ప్రతిష్ఠలకు సంబంధించిన అంశంగా పరిగణించవద్దని తమిళనాడు ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను సీబీఐకి అప్పగించాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది.
బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై కూడా సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ నోటీసుకు రెండు వారాల్లోగా సమాధానాన్ని దాఖలు చేయాలని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, బెల ఎం త్రివేది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, తమిళనాడులోని తంజావూరుకు చెందిన ఓ బాలిక సెయింట్ మైఖేల్స్ గర్ల్స్ హోమ్‌లో ఉంటూ 12వ తరగతి చదువుతున్నారు. ఆమె వయసు 17 సంవత్సరాలు. ఆమెను క్రైస్తవ మతంలోకి మారాలని ఆ హాస్టల్ అధికారులు ఆమెపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చేవారని ఆరోపణలు వచ్చాయి.
తాను క్రైస్తవ మతంలోకి మారబోనని ఆమె చెప్పడంతో ఆమె చేత హాస్టల్ గదులను తుడిపించడం వంటి పనులు చేయిస్తూ ఆమెను వేధించేవారు. ఈ వేధింపులను భరించలేక ఆమె జనవరి 9న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత తాను హాస్టల్‌లో అనుభవించిన బాధలను వైద్యులకు చెప్పారు.
వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన వచ్చి ఆమెను ప్రశ్నించారు. ఆమె వాగ్మూలాన్ని నమోదు చేసుకుని, హాస్టల్ వార్డెన్‌ను అరెస్టు చేశారు. అయితే బాధితురాలు జనవరి 19న ప్రాణాలు కోల్పోయారు.
స్కూల్లో మతమార్పిడి ఒత్తిళ్లతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ చిన్నారి మరణవాంగ్మూలం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. హాస్టల్ వార్డెన్ తనను నిరంతరం దూషిస్తూ ఉండేవారని, అన్ని గదులను తన చేత తుడిపించేవారని, క్రైస్తవంలోకి మారాలని నిరంతరం ఒత్తిడి తీసుకొస్తూ, నిర్బంధించేవారని ఈ వీడియోలో ఆమె చెప్పారు.
అయితే మరో వీడియోలో చిన్నారి వార్డెన్ వేధింపుల్ని భరించలేకపోయినట్లు, పినతల్లి వేధింపులు కూడా కారణమేనని చెప్పడం సైతం వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంలో బీజేపీ, తమిళనాడు ప్రభుత్వాల మధ్య రాజకీయ వాగ్వాదం సైతం చోటు చేసుకుంది.
ఈ పరిణామాల నడుమే.. స్కూల్లో వేధింపుల కోణంలో కాకుండా మతమార్పిడి వేధింపుల కోణంలోనే దర్యాప్తు చేయించాలంటూ లావణ్య తల్లిదండ్రులు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో రాష్ట్ర పోలీసులతో దర్యాప్తు చేయించడం సమంజసం కాదనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచింది మద్రాస్ మధురై బెంచ్.
అదే సమయంలో ఆ వీడియోలను రికార్డు చేసిన వ్యక్తుల పాత్రపైనా అనుమానం వ్యక్తం చేస్తూనే.. ఈ మేరకు సమర్థుడైన అధికారికి అప్పగించాలంటూ సీబీఐని ఆదేశించింది.
ఇదిలావుండగా బాలికపై హాస్టల్‌లో జరిగిన దురాగతాలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్)కు ఫిర్యాదు అందింది. బాధితురాలు క్రైస్తవంలో చేరేందుకు అంగీకరించకపోవడంతో హాస్టల్ వార్డెన్ ఆమె చేత వాష్ డిషెస్, టాయిలెట్స్ శుభ్రం చేయించేవారని ఈ ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు కోసం తమిళనాడు వెళ్ళిన ఎన్‌సీపీసీఆర్ బృందం సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేసేందుకు తమకు అవసరమైన సదుపాయాలను, సహకారాన్ని అందించడంలో తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఈ బృందం ఓ ప్రకటనలో ఆరోపించింది. ఎన్‌సీపీసీఆర్ చైర్మన్ ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని బృందం జనవరి 31న తంజావూరులో విచారణ జరిపింది.
More Stories
జగన్నాథుడి ఆలయ శిఖరంపై ముడిపడిన జెండాలు
బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు
దళారుల చేతుల్లో మోసపోతున్న తిరుమల భక్తులు