మరో 54 చైనా యాప్ లపై నిషేధం

దేశ భద్రతకు ముప్పుందన్న కారణంగా 54 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ జాబితాలో స్వీట్‌ సెల్ఫీ హెచ్‌డి, బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరా, ఈక్వలైజర్‌ అండ్‌ బాస్‌ బూస్టర్‌, కామ్‌కార్డ్‌ ఫర్‌ సేల్స్‌ ఫోర్స్‌ ఎంటర్‌టైనర్‌, ఐసోలాండ్‌ 2 : యాసస్‌ ఆఫ్‌ టైమ్‌ లైట్‌, వివా వీడియో ఎడిటర్‌, టెన్‌సెంట్‌ జీవర్‌, ఒన్‌మోజీ ఎరినా, యాప్‌ లాక్‌, డ్యుయల్‌ స్పేస్‌ లైట్‌ యాప్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. 
 
జాతి భద్రత, సార్వభౌమాధికారినికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని భావిస్తూ గత ఏడాది జూన్‌లో చైనాకు చెందిన 59 మొబైల్‌ యాప్‌లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. వాటిల్లో పాపులర్‌ యాప్‌లైన టిక్‌, వీచాట్‌, హలో కూడా ఉన్నాయి. 2020 మేలో లఢక్‌లోని గాల్వాన్‌ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణ అనంతరం కేంద్రం ఈ చర్యకు ఉపక్రమించింది. ఆ తర్వాత 118 చైనా మొబైల్‌ యాప్‌లను మోడీ సర్కార్‌ బ్లాక్‌ చేసింది.