టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్‌

ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పదోన్నతి కోసం నకిలీ విద్యార్హతలను చూపించారన్న ఆరోపణలపై ఆయనను గురువారం రాత్రి పొద్దుపోయాక విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. 
 
ఒక వేడుకకు హాజరై పటమటలంకలోని తన నివాసానికి చేరుకున్న వెంటనే సీఐడీ అధికారులు ఆయనను తమతో తీసుకెళ్లిపోయారు. అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పని చేసి రిటైర్‌ అయ్యారు.
 అశోక్‌బాబును అదుపులోకి తీసుకున్న అధికారులు. గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. అశోక్‌బాబు అసిస్టెంట్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసే సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.
కొంతమంది అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి అశోక్‌బాబు రికార్డులను ట్యాంపరింగ్ చేసినట్లు సీఐడీ పేర్కొంది. అశోక్‌బాబుపైన సెక్షన్ 477Aఎ, 465, 420 కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చారని మెహర్ కుమార్ అనే ఉద్యోగి అశోక్ బాబుపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.
 
అశోక్‌బాబు ఇచ్చిన తప్పుడు సమాచారంపై జాయింట్‌ కమిషనర్ ఆఫ్‌ స్టేట్ టాక్స్‌ గీతామాధురి సీఐడీకి ఫిర్యాదు చేశారు. గీతామాధురి ఫిర్యాదుతో సీఐడీ అధికారులు అశోక్‌బాబుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. స్పెషల్ చీఫ్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ నుంచి లోకాయుక్త రిపోర్ట్ తెప్పించుకుంది.
2021 ఆగస్టులో అశోక్‌బాబు కేసును సీఐడీకి అప్పగించాలంటూ లోకాయుక్త ఆదేశాలు జారీచేసింది. ఏమి చర్యలు తీసుకున్నారో కూడా తమ దృష్టికి తీసుకురావాలని ఆర్డర్‌లో లోకాయుక్త పేర్కొంది. ఎన్నికల అఫిడవిట్‌లో కూడా ఎమ్మెల్సీ అశోక్‌బాబు.. తాను గ్రాడ్యుయేట్ అంటూ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
 
కాగా,  డిగ్రీ చదవకుండానే చదివినట్లుగా చూపించారని ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉమ్మడి రాష్ట్రంలోనే శాఖాపరమైన విచారణ జరిగింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని అశోక్‌బాబు అప్పట్లో వివరణ ఇచ్చారు. దీనిపై విజిలెన్స్‌ అధికారులు కూడా విచారణ జరిపి… ఆయనపై అభియోగాలను ఉపసంహరించారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలోనే ఈ కేసు ‘క్లోజ్‌’ అయ్యింది.