లతా మంగేష్కర్‌ కు పార్లమెంటు ఘనంగా నివాళి

అమర గాయని లతా మంగేష్కర్‌ మృతి పట్ల పార్లమెంటు ఉభయసభలు సోమవారం ఘనంగా నివాళి అర్పించాయి. ఆ తర్వాత ఆమె స్మృత్యర్థం  గంటపాటు వాయిదా పడ్డాయి. లత మరణం సంగీతానికి, కళా రంగానికి తీరని లోటని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

రాజ్యసభ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే ఛైర్మన్ వెంకయ్యనాయుడు లతా మంగేష్కర్ తన 92 వ ఏట 6 వ తేదీన పరమపదించారని చెప్పారు. ఆమెను స్మరించుకుంటూ సందేశం చదివి వినిపించారు. దాదాసాహెబ్, భారత రత్న ది నైటింగేల్ , మెలోడీ క్వీన్, వంటి అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డులు ఎన్నో ఆమె పొందారని, ఏడు దశాబ్దాలకు మించిన తన కెరీర్‌లో ఒక విదేశీ భాషతోపాటు మొత్తం 36 భారతీయ భాషల్లో 25 వేలకు మించి పాటలు పాడారని గుర్తు చేశారు. 

లతాజీ మరణంతో ఈ దేశం ఓ గొప్పగాయని, దయామూర్తిని, మహోన్నత వ్యక్తిత్వాన్ని కోల్పోయింఇ. ఆమె మరణం ఓ శకానికి ముగింపు , సంగీత ప్రపంచంలో ఆమె లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది అని ఛైర్మన్ వెంకయ్యనాయుడు సంతాపం తెలియచేశారు.

లత స్వరం దశాబ్దాల పాటు దేశాన్ని మంత్రముగ్ధం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘దేశ ఐక్యతను, సాంస్కృతిక వారసత్వాన్ని లత బలోపేతం చేశారు. ఆమె 36 భాషల్లో పాడిన తీరే దేశ ఐక్యతకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ’’ అని ప్రధాని కొనియాడారు. మెలోడీ క్వీన్‌ మరణం దేశ సంగీత రంగానికి తీరని లోటని స్పీకర్‌ ఓం బిర్లా చెప్పారు.

ఇండోర్‌లో లత అకాడమీ 

కాగా, లత జ్ఞాపకార్థం మధ్యప్రదేశ్‌లో ఆమె జన్మస్థలం ఇండోర్‌లో సీఎం శివ్‌రాజ్‌సింగ్‌ చౌహాన్‌ మొక్క నాటారు. ఇండోర్‌లో లత విగ్రహం, ఆమె పాటలతో మ్యూజియం, ఆమె పేరిట కాలేజీ, మ్యూజిక్‌ అకాడమీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏటా లత జయంతి నాడు ఆమె పేరుతో అవార్డు ఇస్తామని చెప్పారు. లత అస్థికలను అల్లుడు ఆదినాథ్‌ సేకరించారు.