కాంగ్రెస్ లేకుంటే ఇన్ని ఇక్కట్లు ఉండెడివి కావు

కాంగ్రెస్ పార్టీ లేకుంటే దేశానికి ఇన్ని ఇక్కట్లు ఉండెడివి కావని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగంకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు రాజ్యసభలో సమాధానమిస్తూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని తీసేయాలని జాతిపిత మహాత్మా గాంధీ కోరుకున్నారని ఆయన గుర్తు చేశారు. గాంధీ కోరుకున్నట్లు కాంగ్రెస్ ఉండకపోతే.. కుటుంబ పాలన నుంచి ప్రజాస్వామ్యానికి విముక్తి లభించేదని చెప్పారు.
‘కాంగ్రెస్ లేకుంటే ఎమర్జెన్సీ ఉండేది కాదు. అవినీతి వ్యవస్థాగతంగా పాతుకుపోయేది కాదు. ఆ పార్టీ లేకుంటే సిక్కుల మారణకాండ ఉండేది కాదు. ఏళ్లకు ఏళ్లు పంజాబ్ తీవ్రవాదంతో అట్టుడికేది కాదు. కశ్మీరీ పండిట్లు తమ జన్మభూమిని వదిలివెళ్లాల్సి వచ్చేది కాదు. ఇల్లు, కరెంటు, నీళ్లు, రోడ్లు లాంటి మౌలిక సదుపాయాల కోసం సామాన్య ప్రజలు ఇన్నేళ్లు వేచి ఉండాల్సిన అవసరం ఉండేది కాదు’ అంటూ ప్రధాని గుర్తు చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని అభివృద్ధి చేయలేదని పేర్కొంటూ ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షంలో ఉండి అడ్డంకులు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై ప్రధాని విమర్శలు గుప్పించారు.  ‘కాంగ్రెస్ కు దేశం మీద కూడా ఏవో అభ్యంతరాలు ఉన్నట్లున్నాయి. భారత్ అనే ఊహ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ అంటోంది’ అంటూ ఎద్దేవా చేశారు.
అలాంటప్పుడు ఆ పార్టీ పేరు భారత జాతీయ కాంగ్రెస్ అని ఎందుకు పెట్టారో చెప్పాలి? అంటూ ప్రధాని నిలదీశారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు పార్టీ పేరును ఫెడరేషన్ ఆఫ్ కాంగ్రెస్ గా మార్చుకోవాలని చురకలు అంటించారు. `మీ పార్టీ మాజీ నేతలు చేసిన తప్పులను మీరు సరిచేయండి’ అని హితవు చెప్పారు. ఈ వాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలపడంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశానికి కుటుంబ పాలన ప్రమాదకరమని ప్రధాని మోదీ హెచ్చరించారు. పార్టీల్లో సంస్థాగతంగా ప్రజాస్వామ్య విలువలు, ఆదర్శాలను జోడించాలని రాజ్య సభలో ప్రధాని కోరారు.  దేశంలో అతి పురాతన పార్టీ అయినా కాంగ్రెస్ నుంచి ఇది మొదలవ్వాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ దీన్ని పాటించి.. అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. 

‘భారత్ 1947లో పుట్టిందనే తప్పుడు భావనలో కొందరు ఉన్నారు. దాని వల్లే చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 50 ఏళ్లు దేశాన్ని ఏలే అవకాశం వచ్చిన పార్టీ పాలన పైన ఈ ఆలోచన ప్రభావం చూపింది. ఈ వికారాలన్నింటకీ ఆ భావనే కారణం. ఈ ప్రజాస్వామ్య దేశానికి మీ (కాంగ్రెస్) దయ అనవసరం’ అని ప్రధాని స్పష్టం చేశారు. 

ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు అని ప్రపంచం ముందు చెప్పడానికి వారు భయపడ్డారని ప్రధాని ఎద్దేవా చేశారు. డెమొక్రసీ, డిబేట్ (ప్రజాస్వామ్యం, చర్చలు) భారత్ లో ఎన్నో శతాబ్దాలుగా ఉనికిలో, ఆచరణలో ఉన్నాయని చెబుతూ వారసత్వ రాజకీయాలను దాటి కాంగ్రెస్ ఏమీ ఆలోచించలేదని ధ్వజమెత్తారు. 

వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలతో భారత్ కు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని అందరూ ఒప్పుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు. ఏదైనా పార్టీలో ఓ కుటుంబమే కీలకంగా మారినప్పుడు.. ఆ ఫ్యామిలీ వ్యక్తుల్లో ఎవరిలో అత్యుత్తమ ప్రతిభ దాగుందనేది ముఖ్యంగా మారుతుందని ప్రధాని చెప్పారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై కూడా రాజ్యసభలో మోదీ  కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీని విభజించే సమయంలో పార్లమెంటులో మైకులు కట్ చేశారు. తలుపులు మూసేశారు. మిర్చి స్ప్రే చేశారు. ఎలాంటి చర్చా జరగలేదు. ఈ తీరు సరైనదేనా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?’ అంటూ ప్రశ్నించారు.

అటల్ జీ ప్రభుత్వం కూడా మూడు రాష్ట్రాల (ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్)ను ఏర్పాటు చేసిందని ప్రధాని గుర్తు చేశారు. ఆ ప్రక్రియ శాంతియుతంగా జరిగింది. అందరూ కలసి చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ విషయంలోనూ ఇలాగే జరిగి ఉండాల్సిందని స్పష్టం చేశారు.

తాము తెలంగాణ వ్యతిరేకులం కాదని, అయితే,  కాంగ్రెస్ అహంకారం వల్లే అప్పుడు కఠిన పరిస్థితుల మధ్య రాష్ట్ర విభజన జరిగిందని తెలిపారు. దాని వల్ల ఇప్పటికీ ఏపీ, తెలంగాణలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని,  అదే సమయంలో కాంగ్రెస్ కు దాని వల్ల రాజకీయంగానూ ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు.