సరస్వతీ విద్యాపీఠం పాఠశాలల్లో వసంత పంచమి

తెలంగాణ వ్యాప్తంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో వసంత పంచమి పూజలు భక్తి ప్రపత్తులతో  నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని  పాఠశాలల్లో సరస్వతీ దేవి ప్రతిమలు, ఫోటోలు ఏర్పాటు చేసుకొని పూజలు చేశారు. ఆయా పాఠశాలల్లోని ఆచార్యులు, మాతాజీలు, పాలకమండలి సభ్యులు, సిబ్బంది  కార్యక్రమాల్లో పాలు పంచుకొన్నారు. 
సరస్వతీ దేవికి విద్యార్థులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా అనేక చోట్ల అక్షరాభ్యాసాలు నిర్వహించారు. పవిత్ర మాఘ మాసంలోని వసంత పంచమి శుభ సమయంలో అక్షరాలను అర్చిస్తుంటే… చక్కటి విద్య అందుతుందని భావన. అందుచేత ఆయా జనావాసాల్లోని ప్రజలకు అవగాహన కల్పించి శిశుమందిరాల్లో అక్షరాభ్యాసాలు నిర్వహించారు.

శ్రీ సరస్వతీ విద్యా పీఠం ప్రధాన కేంద్రాల్లో ఒకటైన బండ్లగూడా జాగీర్ లోని శారదాధామం లో వసంత పంచమి వైభవంగా జరిగింది. స్విస్ ఇంటర్ నేషనల్ స్కూల్, శిక్షణ కేంద్రం,  శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయములకు చెందిన ఆచార్యులు, సిబ్బంది  పెద్ద ఎత్తున పాలు పంచుకొన్నారు.

 ఇక్కడ నెలవై ఉన్న శ్రీ సరస్వతీ దేవాలయంలో అమ్మవారికి అర్చనలు నిర్వహించారు. అక్కడ పెద్ద సంఖ్యలో  అక్షరాభ్యాసములు చేయించారు. రాజధానిలోని అనేక శిశుమందిర్ పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. సరస్వతీ దేవి ఆశీస్సులతో చిన్నారులకు చక్కటి  విద్యాబుద్దులు కలగాలని ఆకాంక్షిస్తూ పండితులు పూాజాదికాలు జరిపించారు. 
 
మొత్తంగా  అన్ని శిశుమందిర్ పాఠశాలల్లో పండగ వాతావరణం నెలకొంది. సంక్లిష్ట సమయంలో కూడా విద్యా బోధన సాగిస్తున్న శిశుమందిర్ పాఠశాలలు… కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వమించాయి.