తొలితరం జనసంఘ్ నేత జంగారెడ్డి కన్నుమూత 

తొలితరం భారతీయ జనసంఘ్ నేత, జనసంఘ్ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన ముగ్గురిలో ఒకరు (తెలంగాణాలో మొదటిసారి), దక్షిణాది  రాష్ట్రాల నుండి బిజెపి అభ్యర్థిగా లోక్ సభకు మొదటిసారిగా ఎన్నికైన  చందుపట్ల జంగారెడ్డి (83) కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి హైదరాబాద్‌లో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన చందుపట్ల జంగారెడ్డి 18 నవంబర్ 1935 న జన్మించారు. ఆయన 1953లో సి.సుధేష్ణను వివాహం చేసుకున్నారు. ఆయన మూడు సార్లు ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభకు, ఒక సారి లోక్ సభకు ఎన్నికయ్యారు.
వృధాప్యంలో కూడా పార్టీ కార్యకలాపాలు,  పార్టీ కార్యకర్తల ఆహ్వానాలు తప్పనిసరిగా హాజరయ్యే ఆయన చివరివరకు నమ్మిన సిద్ధాంతం కోసం నిజాయతీతో పనిచేశారు. ముక్కుసూటిగా తన వాదనలను వినిపించడంలో,  పార్టీ కార్యకర్తలు ఎవ్వరు ఆపదలో ఉన్నప్పటికీ వెంటనే స్పందించడంలో ఆయన ముందుండేవారు.
జంగారెడ్డి గారు రాజకీయాల్లోకి రాక ముందు కొంత కాలం ఉపాద్యాయునిగా పనిచేశారు.ఉద్యోగాన్ని వలిదిపెట్టి భారతీయ జనసంఘ్ పార్టిలో చేరారు. 1967 లో మొదటిసారిగా పరకాల ఎం.ఎల్.యే గా జనసంఘ్ నుంచి గెలుపొందినారు. తరువాత 1972 లో అదే నియోజకవర్గం నుంచి పింగిళి ధర్మారెడ్డి తో పోటి పడి ఓడిపోయారు.
1978 ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం యెస్.సి రిజర్వ్ కావడం వలన ధర్మారెడ్డి, జంగారెడ్డి పరకాల పక్కనేఉన్న జనరల్ సీటు శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి తలపడ్డారు. ఆ ఎన్నికల్లో జంగారెడ్డి గెలుపొందారు. 1983 లో మళ్ళి శాయంపేట నుంచి ధర్మారెడ్డి పై గెలుపొందారు. ఆ కాలంలోనె చాలా గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించడంతో ఆయన కరెంటు జంగన్న గా గుర్తింపు పొందారు.1984 పార్లమెంటు ఎన్నికల్లో హ‌నుమ‌కొండ నుంచి పివి నర్సింహారావుపై దాదాపు 54వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించి ద‌క్షిణ భార‌త‌దేశం బీజేపీ తొలి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యి రికార్డు సృష్టించారు.1984 లో దేశవ్యాప్తంగా బిజె.పి నుంచి ఇద్దరు ఎం.పి.లు గెలిస్తే అందులో ఒకరు జంగారెడ్డి కాగా, మరొకరు ఏ.కె పటేల్ గుజరాత్ లోని మెహ్సానా నియోజక వర్గం నుంచి గెలుపొందారు. 

ఆ ఎన్నికల్లో వాజపాయ్ వంటి అగ్రనాయకులు సహితం ఓటమిపాలయ్యారు. పార్లమెంటులో జంగారెడ్డిని చూడగానే పి.వి. సాబ్ మీద గెలిచింది ఈయనే అని గుస గుసలు పెట్టుకునేవారట. వాజపేయి జంగారెడ్డిని తన సన్నిహితుడిగా చెప్పేవారు. 

డా. వడ్డీ విజయసారధి నివాళి 
1984లో ఎన్నికల తర్వాత లోకసభలో భాజపాకు ఇద్దరే సభ్యులుండేవారు. గుజరాత్ నుండి ఎన్నికైన డా౹౹ఏ.కే.పటేల్ నాయకునిగా ముందు బెంచీల్లోకూర్చుంటే, జంగా రెడ్డి గారు వెనుక ఎక్కడో కూర్చునే వారు. అలాంటి వ్యక్తివైపు అందరూ వెనుతిరిగిచూసిన సందర్భం మరువరానిది.
 
బొఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో చెల్లింపబడిన ముడుపుల గురించి సభలో ప్రస్తావన వచ్చింది. లోటస్ అనే కోడ్ నేమ్ ఉన్న ఖాతాలో అవి జమ అయినట్లుగా తెలిసిందని మంత్రి చెప్పారు. అప్పుడు భాజపా ఎన్నికల గుర్తు లోటస్(కమలం) కాబట్టి ఇంకేముంది చర్చించడానికి, అవి బిజేపి వాళ్ల ఖాతాలోనే జమయ్యాయని అందరూ గొణుక్కోవటం ఆరంభించారు. 
 
నల్గురైదుగురు ఆమాట పైకి అన్నారు. అప్పుడు వెనుక బెంచీల నుండి ఒక గొంతు గట్టిగా వినబడింది. వో రాజీవ్ జీకా నామ్ హై. లోటస్ మానే రాజీవ్ ! రాజీవ్ కో అంగ్రజీమే లోటస్ కహ్తే హై. రాజీవ గాంధీ అప్పుడు ప్రధానమంత్రి. సంఖ్యాబలంతో సంబంధం లేకుండా వాస్తవాన్ని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పగల సాహసి చందుపట్ల జంగారెడ్డిగారు. ఆ యోధునికి శతశత నమస్సులతో నివాళి అర్పిస్తున్నాను.