జంగన్న మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం 

బిజెపి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ సి జంగారెడ్డి మృతి పట్ల ప్రధాన నరేంద్ర మోదీ, పలువురు నాయకులు సంతాపం తెలిపారు.జంగారెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. జంగా రెడ్డి బీజేపీ క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు సమర్థవంతమైన వాణిని అందించారని కొనియాడుతూ ఆయన కుమారుడితో మాట్లాడి సంతాపం తెలపడం జరిగిందని ప్రధాని ట్వీట్ చేశారు. 
 
“శ్రీ సి . జంగా రెడ్డి గారు ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు . జన సంఘ్ నూ , బి జె పి నూ ఉన్నత శిఖరాలకు తీసికెళ్ళడానికి ఆయన ఎంతో కృషి చేశారు . ఎంతో మంది ప్రజల మనసులలో స్థానాన్ని సంపాదించుకున్నారు . ఎంతో మంది కార్యకర్తలకు స్ఫూర్తి నిచ్చారు . ఆయన మరణం పట్ల చింతిస్తున్నాను” అని ప్రధాని ట్వీట్ లో పేర్కొన్నారు.
 
“శ్రీ సి జంగా రెడ్డి గారు భాజపా క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు సమర్థవంతమైన వాణిని అందించారు. ఆయన కుమారుడితో మాట్లాడి సంతాపం తెలపడం జరిగింది. ఓం శాంతి” అంటూ మరో ట్వీట్ చేశారు.
 
 రాజకీయాల్లో తమకు స్పూర్తి ప్రదాత చందుపట్ల జంగారెడ్డి అని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసగరరావు ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీని గ్రామాల్లో బలోపేతం చేయడానికి, ప్రజలకు సేవ చేసేందుకు కృషి చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. ఈరోజు బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే… అందులో ముఖ్యపాత్ర జగ్గారెడ్డి పోషించారని పేర్కొన్నారు. 
 
జంగారెడ్డికి దేశవ్యాప్తంగా పేరు రావడానికి కారణం 1984లో బీజేపీ తరపున ఇద్దరు ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు జంగారెడ్డి అని చెప్పుకొచ్చారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో జంగారెడ్డి పాత్ర మరువలేనిదని తెలిపారు. తెలంగాణలో అందరూ ఆయనను ‘కరెంట్ జంగన్న’ అని ప్రేమగా పిలుచుకునే వారనిసీహెచ్.విద్యాసాగరరావు తెలిపారు.
 చందుపట్ల జంగారెడ్డి( మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జంగారెడ్డి మృతికి పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాజీ పార్లమెంట్ సభ్యులు చందుపట్ల జంగారెడ్డి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. వారి మరణం వరంగల్ ప్రజలకు, రాజకీయాలకు తీరని లోటు అని చెబుతూ వారి ఆలోచనలు ఎప్పుడు ప్రజల గురించే వుండేవని పేర్కొన్నారు.  
 
పేద‌లకు, అణ‌గారిన వ‌ర్గాల వారికి సేవ‌ చేయడంలో ఆయ‌న చూపిన నిబ‌ద్ధ‌త, చొరవ తన లాంటి నాయకులకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియచేశారు.
 
 జంగారెడ్డి మృతి పట్ల బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.ఇంద్రసేనారెడ్డి సంతాపం తెలుపుతూ  తాను కాలేజీ విద్యనభ్యసించే రోజుల్లోనే జంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ విద్యార్ధి సమస్యలపై పోరాడేవారని గుర్తుచేశారు. తనను నిరంతరం రాజకీయాల్లో ప్రోత్సహించిన నాయకుడు జంగారెడ్డి అని పేర్కొన్నారు. 
 
చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా తీర్మానం చేయాలంటూ కొట్లాడిన నాయకుడు జంగారెడ్డి అని ఆయన కొనియాడారు. ఎమర్జెన్సీ కాలంలో జైలుకు వెళ్లిన నాయకుడని చెబుతూ ‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నది జంగన్న కల. అది చూడాలని నిరంతరం తపించేవారు’’ అని చెప్పుకొచ్చారు. జంగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా అని చెప్పారు.
 
మరోవైపు జంగారెడ్డి పార్థివ దేహానికి హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో  పలువురు రాజకీయ నేతలు నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.,బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు., ఎంపీ బండి సంజయ్, బీజేపీ  నాయకురాలు డీకే అరుణ., బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌., నల్లు ఇంద్రాసేన రెడ్డి.,పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు జంగారెడ్డి భౌతిక కాయం వద్ద నివాళురల్పించారు.