వారసత్వ ప్రదేశాల జాబితాలో లేపాక్షి లేదు

ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు కోసం దేశంలో గుర్తించిన 46 తాత్కాలిక ప్రదేశాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ప్రాంతం కూడా లేదని కేంద్రం స్పష్టం చేసింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కిషన్ రెడ్డి ఆ మేరకు రాజ్యసభలో జవాబిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సరైన చొరవ తీసుకోకపోవడం వల్లే లేపాక్షి సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల జాబితాలో లేదని జీవీఎల్ విమర్శించారు.  లేపాక్షిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు నిరంతరం ప్రయత్నిస్తానని, తన కృషి సానుకూల ఫలితాలనిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
దేశం గర్వించదగ్గ సాంస్కృతిక వారసత్వ సంపద కంటే జిన్నా వారసత్వాన్ని కాపాడుకోవడం మీదే వైసీపీ ఎక్కువ ఆసక్తి చూపుతోందని జీవీఎల్ నరసింహారావు దుయ్యబట్టారు. వైసీపీకి జిన్నా ముద్దు-ఆంధ్ర సంస్కృతి వారికొద్దని విమర్శించారు.
కాగా,  కేంద్ర ప్రభుత్వ ప్రషాద్ పథకంలో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు దేవస్థానాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అమరావతి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవస్థానాలు పథకంలో భాగంగా ఉన్నాయని బీజేపీ పార్లమెంట్ సభ్యులు టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు  కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు వీటిని పథకంలో చేర్చామని పేర్కొన్నారు. అమరావతికి 2015-16లో రూ. 27.77 కోట్లను పర్యాటక గమ్యస్థానం కింద అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసినట్టు వెల్లడించారు. శ్రీశైలం ఆలయాభివృద్ధి కోసం రూ. 37.88 కోట్ల ఖర్చు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు.
 
కొవ్వాడలో అణు విద్యుత్‌ కేంద్రం
 
అమెరికా సహకారంతో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్‌ కేంద్రం నెలకొల్పాలని ప్రతిపాదించినట్లు పిఎంఒ కార్యాలయం సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. 
 
వైసిపి ఎంపి వి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ మొత్తం ఆరు రియాక్టర్లతో 1,208 మెగావాట్ల సామర్థ్యంతో ఈ అణు విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. 
 
దేశీయంగా తయారయ్యే ప్రెషరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్స్‌ (పిహెచ్‌డబ్ల్యుఆర్‌)ను ప్రతిపాదిత కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రంలో ఏర్పాటు చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. 
 
దేశం మొత్తమ్మీద ప్రస్తుతం 18 ప్రెషరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్స్‌ అణు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండగా, మరో ఆరు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. అదనంగా మరో 10 ప్రెషరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్స్‌ ఏర్పాటుకు ఆర్థిక, పాలనాపరమైన మంజూరు జరిగిందని చెప్పారు. ఈ మొత్తం రియాక్టర్ల ద్వారా 7 వేల మెగావాట్ల అణు విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని మంత్రి వివరించారు.